వేగవంతమైన పోలీస్ సేవలకు కృషి చేయాలి
మహబూబాబాద్, జులై 21 (విజయక్రాంతి): అనుభవాన్ని కార్యాచరణగా మార్చి, ప్రజలకు వేగవంతమైన పోలీసు అందించేందుకు కృషి చేయాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే పనిచేయాలని జిల్లాలోని ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్ లకు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుళ్లు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు (ఏఎస్‌ఐలు)తో మహబూబాబాద్ లో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ప్రత్యేక సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ.మాట్లాడుతూ హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలు పోలీస్ స్టేషన్ వ్యవస్థలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తారని, తమ సీనియారిటీ, అనుభవాన్ని సమర్థవంతమైన కార్యాచరణగా మార్చి ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన పోలీసు సేవలు అందించాలని సూచించారు. విధుల నిర్వహణలో భావోద్వేగాలకు, రాగద్వేషాలకు లోనుకాకుండా చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదగా, సహనంతో, గౌరవప్రదంగా వ్యవహరిస్తూ ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని సూచించారు.






