1 September, 2026 | 1:17 AM

సంచార జాతుల అభివృద్ధికి పాటుపడాలి

01-09-2026 12:00 AM

కేంద్ర సంచార జాతుల బోర్డు మాజీ చైర్మన్ రాంజీ ఇదాతే

జవహర్‌నగర్, ఆగస్టు 31 (విజయ క్రాంతి): సంచార జాతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం పాటుపడాలని సంచార జాతుల స్థిర నివాసానికి ప్రభుత్వం పక్కా ఇల్లు కట్టివ్వాలని, సంచార జాతుల అభివృద్ధికి శాశ్వతంగా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర సంచార జాతుల బోర్డు మాజీ చైర్మన్ బికు రాంజీ పేర్కొన్నారు. జవహర్ నగర్ దేవేందర్ నగర్ లోని వడ్డే ఓబన్న విగ్రహ ప్రాంగణంలో సోమవారం 75వ సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర సంచార జాతుల బోర్డు మాజీ చైర్మన్ బికు రాంజీ ఇదాతే ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.  స్వాతంత్రం సిద్ధించి 80 ఏళ్లు గడుస్తున్నా సంచార జాతుల జీవితాల్లో ఎలాంటి పురోగతి కనిపిస్తలేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు బ్యాంకు గానే వాడుకుంటున్నారే తప్పితే చేసిందేమీ లేదని శాశ్వతంగా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి సంచార జాతుల్లో కొత్త కాంతులు నింపాలని ఆయన తెలిపారు.

సంచార జాతుల 75వ విముక్తి దినోత్సవాన్ని పురస్కరించుకొని సంచారజాతుల అభివృద్ధి మండలి రాష్ట్ర సహా కార్యదర్శి నర్ర మహేష్ ఆధ్వర్యంలో సోమవారం ఆత్మగౌరవ పోరాటాల కార్యక్రమాన్ని నిర్వహించారు.  సామాజిక సమరసతా వేదిక కళా విభాగం అఖిలభారత కన్వీనర్ అప్పల ప్రసాద్  సంచార జాతులు కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకుమార్ చిరంజీవి నర్రా మహేష్, దుర్గేష్, రాము, మల్లేష్, రాజన్, షిండే, సువీర్ జీ, పెద్ద సంఖ్యలో సంచార జాతుల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.