వార్డుల అభివృద్దే... పట్టణ అభివృద్ధి
మెట్ పల్లి,(విజయక్రాంతి): అన్నీ వార్డుల్లో అభివృద్దే పట్టణ అభివృద్ధి అని మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి అన్నారు. సోమవారం పురపాలక సంఘ సమావేశ మందిరంలో కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పదమూడు అంశాలను పొందుపరచగా ఆ అంశాలను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతరం కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ... వర్షాల వలన కొన్ని రోడ్లలో గుంతలు ఏర్పడ్డాయని ఆ గుంతలను వెంటనే పూడ్చాలని, అలాగే రాబోవు వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక మండపాల వద్ద నీరు నిలవకుండా మట్టి పోయించాలని, అవసరమున్న చోట వెంటనే వీది దీపాలను బిగించాలని కోరారు. పట్టణంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ వార్డులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. చైర్మన్ మాట్లాడుతూ కౌన్సిల్ సభ్యులు కోరినట్టు సమస్యలను పార్టీలకు అతీతంగా అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేస్తామని, ఎస్సీ ఎస్టీ వార్డులపై కూడా దశలవారీగా అభివృద్ధి పరుస్తామని, రాబోవు రోజుల్లో మున్సిపాలిటీకి నిధులు సమకూర్చుకొనుటకు తగు చర్యలు చేపడతామని తెలిపారు.






