5 July, 2026 | 4:26 AM

రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర

05-07-2026 01:20 AM
  1. రాముడి పేరు చెప్పి మూడోసారి అధికారంలోకి
  2. గాంధీ, నెహ్రూల త్యాగాలపై బీజేపీ వక్రభాష్యం
  3. నటరాజన్ రాజ్యసభ సీటును సైతం దొంగిలించారు
  4. రాహుల్ స్ఫూర్తితో తెలంగాణలో కులగణన విజయవంతం
  5. ఐయూసీ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): రాముడిపేరు చెప్పి మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ భారత రాజ్యాంగాన్ని మార్చి మనువాద రాజ్యాంగాన్ని అమలు చేయాలని కుట్రలు పన్నుతుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. శనివారం ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ లీగల్ కాంక్లేవ్‌కు హాజరై బీజేపీ, ప్రధాని మోదీ విధానాలపై విరుచుకుపడ్డారు. గాంధీ, నెహ్రూల నాయకత్వాన్ని, వారి త్యాగాలను చిన్నచూపు చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

బీజేపీ పార్టీలో అసలు రాముడికి సభ్యత్వం ఉందా? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళ అని చూడకుండా మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సీటును సైతం దొంగిలించారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్‌ను తమకు అనుకూలంగా చేసుకొని ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. బీహార్, పశ్చిమ బెంగాల్‌లో 90 లక్షల ఓట్లు తొలగించి, పోరాడితే కేవలం 30 లక్షల ఓట్లు జతచేశారని విమర్శించారు. మోదీ భ్రమలు వీడాలని మంచి మంచి మహారాజులే కాలగర్బంలో కలిసిపోయారని ధ్వజమెత్తారు.

మోదీ, అమిత్‌షా తీరు అధికారమే పరమావధిగా ఉందన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్‌జోడో యాత్ర ప్రశంసనీయమని కీర్తించారు. రాహుల్ స్ఫూర్తితో వందేళ్ల తరువాత కులసర్వే నిర్వహించామన్నారు. దీంతో దేశానికే తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. పేపర్ లీకులతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబ, ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్, ముఖ్య అతిథులుగా ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఆల్ ఇండియా కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ కృష్ణ అలవేరు, కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, గురుదీప్ సింగ్, రోషిని జైస్వాల్, శ్రావణ్ రాజ్, సుప్రియ, వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, యువ కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.