7 July, 2026 | 3:37 PM

Breaking News

పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   హోటళ్ళలో పరిశుభ్రత పాటించకుంటే జరిమాన తప్పదు   •   పెద్దకొత్తపల్లి కేజీబీవీ ఆకస్మిక తనిఖీ   •   కాళేశ్వరం 'కూళేశ్వరం'గా మారింది: మహేష్ గౌడ్   •   అన్ని వర్గాల ప్రజలకు అండగా ఎమ్మార్పీఎస్   •  

విద్య జీవితాన్ని మార్చే ఆయుధం: కలెక్టర్

02-02-2026 01:09 AM

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 1, (విజయక్రాంతి): విద్య జీవితాన్ని మార్చే ఆయుధం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.ఆదివారం జిల్లాలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 16 షెడ్యూల్ కులాల వసతి గృహాలలో 10వ తరగతి చదువుతున్న 212 మంది విద్యార్థినీ విద్యార్థులకు ప్రేరణ, శిక్షణ తరగతులను  కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించి, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై భారత రాజ్యాంగ శిల్పి డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల అలంకరణ గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్య అనేది జీవితాన్ని మార్చే ప్రధాన ఆయుధమని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని సూచించారు. 10వ తరగతిలో వచ్చే మార్కులు మాత్రమే జీవిత విజయానికి కొలమానం కాదని, నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించి సమాజంలో స్థిరపడినప్పుడే నిజమైన విజయాన్ని పొందినట్టు అవుతుందని తెలిపారు.విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల వంటి విలువలను అలవర్చుకోవాలని సూచించారు.

ప్రభుత్వము ఎస్సీ విద్యార్థుల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వార్డెన్ల సూచనలను పాటిస్తూ నిరంతర కృషితో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.ఈ ప్రేరణ, శిక్షణ తరగతుల ద్వారా విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరిగి, మెరుగైన విద్యా ఫలితాలు సాధించేందుకు దోహదపడుతాయని కలెక్టర్ తెలిపారు.

అనంతరం సబ్జెక్టు నిపుణులు విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన బోధన అంశాలపై శిక్షణ అందించారు. ప్రతి సబ్జెక్టులో ముఖ్యమైన అధ్యాయాలు, ప్రశ్నల రూపకల్పన, సమయ నిర్వహణ, పరీక్షలలో మార్కులు ఎలా సాధించాలి అనే అంశాలపై వివరంగా బోధించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ, పరీక్షలపై ఉన్న భయాన్ని తొలగించే విధంగా మార్గదర్శనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి  ఎ. శ్రీలత, సహాయ సంక్షేమ అధికారులు  కొప్పుల హనుమంతరావు,  సిహెచ్. అక్షయ్, జిల్లాలోని వసతి గృహ సంక్షేమ అధికారులు, కార్యాలయ సిబ్బంది ఆర్.వి.ఆర్. ప్రసాద్,  నరసింహారావు, సాయి చరణ్, నాగలక్ష్మి మరియు బోధన సిబ్బంది తారాచంద్,  మోహన్ రావు,  దస్తగిరి,  బి.వి.ఎల్. కుమార్,  బాలాజీ తదితరులు పాల్గొన్నారు.