వీబీ జీరామ్‌జీ పథకం కింద ఎకో పాండ్
- వెదురు సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి
- నకిలీ డీఏపీ తయారీదారులపై కఠిన చర్యలు
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి) : విబీజీరామ్‌జీ కింద ఎకో పాండ్లు ( పర్యావరణహితమైన కుంటలు), వెదురు సాగు చేపట్టేలా పంచాయతీరాజ్ అధికారులతో వ్యవసాయ శాఖ సమన్వయం చేసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ప్రభుత్వం నిర్ధారించిన 9 వరి రకాలను సాగు చేసిన రైతులు, ఎఈఓ ల దగ్గర రిజస్ట్రీ చేసుకునే విధంగా రైతువేదికల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
సచివాలయంలో తన శాఖ పరిధిలోని వివిధ శాఖలు, సంస్థల ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల పురోగతిని శాఖల వారీగా మంత్రి సమీక్షించారు. రైతులకు సేవలందించేందుకు అవసరమైన మేరకు ఉద్యోగులను భర్తీ చేసుకోవాలని, అవసరమైతే ఇతర శాఖల నుంచి సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని సూచించారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రతి పైసాను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, మార్క్‌ఫెడ్‌కు మంజూరైన 65 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణాలను వరి అధికంగా పండించే జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని మంత్రి సూచించారు. ఉద్యోగుల హాజరుపై రూపొందించిన ప్రత్యేక సాప్ట్‌వేర్‌ను అన్ని శాఖల్లో అమలు చేసి, ప్రతి ఉద్యోగి హాజరును అందులో నమోదు చేయాలని ఆదేశించారు. ఆయిల్‌ఫామ్ సాగు విస్తరణను మరింత వేగవంతం చేయాలని, నర్సరీల్లో మిగిలిపోయిన మొక్కలను వెంటనే విక్రయించి, వచ్చే నెలకు నాణ్యమైన కొత్త మొక్కలను సిద్ధం చేయాలని సూచించారు. నకిలీ డీఏపీ తయారీకిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
మార్కెట్లలో కొనసాగుతున్న ఆర్డీ వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, కోఆపరేటివ్ కమిషనర్ రాహుల్ రాజ్, హాకా ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, వ్యవసాయ, హార్టికల్చర్ యూనివర్సిటీల వీసీలు జానయ్య, రాజిరెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మణుడు తదితర అధికారులు పాల్గొ న్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తు న్న పథకాల పురోగతిపై కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మూడు రాష్ట్రాలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి తుమ్మల పాల్గొన్నారు.
ఆర్‌కేవీవై అమలులో తెలంగాణ సాధిస్తున్న ఉత్తమ పురోగతిని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్‌ను తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తున్న తీరును కేంద్ర మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా ఆర్‌కేవీవై రెండో విడత నిధులను తెలంగాణకు మంజూరు చేయాలని మంత్రి తుమ్మల కోరారు. త్వరలోనే నిధులు విడుదల చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.






