1 August, 2026 | 2:57 AM

టీబీ నిర్మూలనకు ముందస్తు పరీక్షలే కీలకం

01-08-2026 02:04 AM

నాగల్గిద్ద, జూలై 31 : టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా నాగల్గిద్ద మండలం కరాస్ గుత్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఉచిత ఛాతీ ఎక్స్రే శిబిరం నిర్వహించినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ జువేరియా బేగం తెలిపారు. శిబిరంలో మొత్తం 86 మందికి ఛాతీ ఎక్స్రే పరీక్షలు నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రెండు వారాలకు పైగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, రాత్రివేళ చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీబీని ముందస్తుగా గుర్తించి సకాలంలో పూర్తి చికిత్స పొందితే పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీబీ నిర్ధారణ పరీక్షలు, చికిత్స, మందులు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిబిరంలో సూపర్వైజర్ విక్టోరియా రాణి, వైద్యులు పూజ పాటిల్, రాజశేఖర్ రెడ్డి, నర్సింగ్ ఆఫీసర్లు సబిత, హెల్త్ అసిస్టెంట్ మాధవ్రావు, ఫార్మసిస్ట్ గిరి, ఎస్టీఎస్ (నారాయణఖేడ్) ప్రకాశ్, ఏఎన్‌ఎంలు శాంతి, లక్ష్మీ తదితర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.