దోమకొండలో అంగరంగ వైభవంగా దుర్గమ్మ బోనాలు
భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాల సమర్పణ
దోమకొండ, ఆగస్టు 9 (విజయక్రాంతి): దోమకొండ మండల కేంద్రంలోని దుర్గమ్మ ఆలయంలో ఆషాఢ మాసం రెండో ఆదివారం సందర్భంగా దుర్గమ్మ బోనాల పండుగను భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. పెరిక, ముదిరాజ్, రెడ్డి, పద్మశాలి తదితర సంఘాల సభ్యులతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాలను సమర్పించారు.
మేళతాళాలు, కోలాటాల నడుమ బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి దుర్గమ్మ అమ్మవారికి సమర్పించారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. విద్యుత్ దీపాలతో ఆలయ అలంకరణ బోనాల పండుగను పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఈ వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, యువతతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి నామస్మరణతో దోమకొండలో పండుగ వాతావరణం నెలకొంది.






