అమృతం అంటే మరణం లేనిది..
కోదాడ, ఆగస్టు 9 :అమృతం అంటే తాగే ద్రావణం కాదని, దాని అర్థం మరణంలేనిదని ప్రబోధ సేవా సమితి కోదాడ శాఖ సభ్యులు పేర్కొన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని నయానగర్లో జ్యోతి అపార్ట్మెంట్ పరిసర ప్రాంతంలో త్రైత సిద్ధాంత భగవద్గీత, అనుబంధ త్రైత సిద్ధాంత గ్రంథాలను ఇంటింటికి తిరిగి పరిచయం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమృతం అంటే రసాయనం కాదని, మృతం అంటే చావు అని, అమృతం అంటే మరణం లేనిదని అన్నారు.
మరణం వద్దు అనుకుంటే శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీతలోని జ్ఞానం ప్రకారం ఆచరించినప్పుడు కర్మలు కాలిపోయి, జీవాత్మ మళ్లీ పుట్టాల్సిన అవసరం లేకుండా పరమాత్మలోకి ఐక్యం అయిపోయినప్పుడు అమృతం సిద్ధిస్తుందన్నారు. పురాణాల కథల ప్రకారం భారీ సర్పం, పర్వతం సహాయంతో సముద్రాన్ని చిలికినప్పుడు లభించే ద్రావణం అమృతం కాదన్నారు. శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీతలో పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జననం తప్పదు అనే శ్లోకం ఎవరూ ఖండించలేరన్నారు.
చావు పుట్టుకల చక్రం నుంచి తప్పించేదే భగవద్గీత అన్నారు. ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు రచించిన త్రైత సిద్ధాంత భగవద్గీతతో పాటు 101 త్రైత సిద్ధాంత గ్రంథాలను చదివి దేవుడి జ్ఞానం తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముత్తవరపు శైలజ, రాళ్ళబండి శైలజ, జాస్తి శివరామకృష్ణ, వంగాల మహేష్, ఆదిత్య, సైదా, నర్సింహారావు పాల్గొన్నారు.






