కేఎల్‌ఐ నీళ్లపై పొలిటికల్ ఫైట్!?
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శలకు ఎమ్మెల్యే మేఘారెడ్డి కౌంటర్
మా హెచ్చరికల తర్వాతే పంపులు ఆన్ అంటున్న బీఆర్‌ఎస్
ఆగస్టు 1 నుంచే నడుస్తున్నాయంటున్నా ఎమ్మెల్యే మేఘారెడ్డి
నీళ్ల లెక్కలతో ఇరువైపులా సవాళ్లు.. వనపర్తిలో వేడెక్కిన నీళ్ల రాజకీయం
వనపర్తి, ఆగస్టు 9 (విజయక్రాంతి): కేఎల్‌ఐ నీళ్ల వ్యవహారం ఇప్పుడు నీటి విడుదలను దాటి వనపర్తి రాజకీయాల్లో మరో పవర్ఫుల్ పొలిటికల్ ఫైట్కు తెరలేపింది. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చేసిన విమర్శలకు బీఆర్‌ఎస్ నేతలు అండగా నిలవగా.. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తీవ్ర స్థాయిలో ఎదురుదాడికి దిగారు. దీంతో కేఎల్‌ఐ పంపులు, రిజర్వాయర్లు, కాలువల కంటే నిరంజన్రెడ్డిమేఘారెడ్డి మాటల యుద్ధమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
‘హెచ్చరిస్తేనే కదిలారా?’
కేఎల్‌ఐ పరిధిలోని ఎల్లూరు, జొన్నలబొగడ, గుడిపల్లి రిజర్వాయర్ల నుంచి రైతులకు సాగునీరు విడుదల చేయాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్ లు శనివారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు.
ఈ నెల 11న నార్లాపూర్ రిజర్వాయర్ను ముట్టడిస్తామని బీఆర్‌ఎస్ హెచ్చరించిన తర్వాతే ప్రభుత్వం పంపులను నడిపిందని వారు ఆరోపించారు. ‘హెచ్చరికలు ఇచ్చిన తర్వాతే మోటర్లు ఎందుకు ఆన్ అయ్యాయి?’ అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. కేఎల్‌ఐ పరిధిలోని సుమారు 500 చెరువులు, కుంటలను నింపకుండా రిజర్వాయర్లలో నీరు నిల్వ చేయడం వల్ల రైతులకు ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. జూరాలకు వస్తున్న వరద నీటిని పూర్తిస్థాయిలో వినియోగించి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
మోటర్లు ఆన్ చేయలేదా? ఆధారాలు చూపండి!’...
బీఆర్‌ఎస్ విమర్శలకు ఎమ్మెల్యే మేఘారెడ్డి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ‘మోటర్లు ఆన్ చేయలేదని ఏ ఆధారంతో మాట్లాడుతున్నారు?’ అంటూ ఎమ్మెల్యే మేఘారెడ్డి శనివారం ఒక ప్రకటన ద్వారా ప్రశ్నించారు. ఆగస్టు 1 నుంచే ఎంజీకేఎల్‌ఐ లిఫ్ట్-1, లిఫ్ట్-2 ద్వారా నీటి ఎత్తిపోతలు జరుగుతున్నాయని, ఇప్పటివరకు శ్రీశైలం నుంచి 2.7 టీఎంసీల నీటిని ఎత్తిపోశామని తెలిపారు. ఎల్లూరు, సింగోటం రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వలను కూడా వివరించారు. జొన్నలబొగడ రిజర్వాయర్కు మూడు పంపుల ద్వారా 2,400 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 2,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 6న లిఫ్ట్-3ను కూడా ప్రారంభించామని పేర్కొన్నారు.
ప్రెస్‌మీట్‌కు ముందు కనీసం లెక్కలు తెలుసుకోండి!
నీటి పారుదల వ్యవస్థలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా రాజకీయ ప్రకటనలు చేయడం సరికాదని ఎమ్మెల్యే మేఘారెడ్డి విమర్శించారు. పంపులు ఎప్పుడు ఆన్ చేశామో.. ఎంత నీరు ఎత్తిపోశామో.. రిజర్వాయర్లలో ఎంత నిల్వ ఉందో.. కాలువలకు ఎప్పుడు నీరు విడుదల చేశామో లెక్కలతో చెబుతున్నామని అన్నారు. ఆగస్టు 7న అన్ని కాలువలకు సాగునీరు విడుదల చేశామని, ఆగస్టు 8న గుడిపల్లి రిజర్వాయర్ గేట్లు ఎత్తి నీటిని కాలువలకు విడుదల చేశామని తెలిపారు.
బీఆర్‌ఎస్ ప్రశ్న.. కాంగ్రెస్ కౌంటర్.. మధ్యలో రైతు!
ఇరువర్గాల మాటల్లోనూ ఒకే అంశంరైతుకు నీరు. కానీ దానిపై రాజకీయ లెక్కలు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. ‘మా హెచ్చరికల తర్వాతే ప్రభుత్వం కదిలిందని బి ఆర్ ఎస్ నాయకులు చెబుతుండగా ‘ఆగస్టు 1 నుంచే పంపులు నడుస్తున్నాయి. ఆధారాలు లేకుండా ఆరోపణలెందుకు?’ అని ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు అసలు పరీక్ష మాత్రం రిజర్వాయర్లలోని నీటి నిల్వలపై కాదు.. ఆ నీరు రైతు పొలానికి ఎంత మేరకు చేరిందన్నదే ప్రధాన అంశంగా వనపర్తి నియోజకవర్గం మొత్తం హాట్ టాపిక్ గా మారింది
కేఎల్‌ఐ.. ఇక నీళ్ల యుద్ధం కాదు, రాజకీయ ప్రతిష్టకు వేదిక!
ఈ నెల 11 న నార్లాపూర్ ముట్టడికి బీఆర్‌ఎస్ పిలుపు ఇవ్వడం, దానికి ముందే కాంగ్రెస్ ప్రభుత్వం నీటి విడుదలపై లెక్కలు బయటపెట్టడం.. ఇరువైపులా మాటల దాడి పెరగడం చూస్తే కేఎల్‌ఐ నీటి అంశం రాబోయే రోజుల్లో మరింత రాజకీయంగా వేడెక్కే సంకేతాలు కనిపిస్తున్నాయి. నీళ్లు ఎవరు ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? ఎంత ఇచ్చారు? ఎవరి ఒత్తిడితో ఇచ్చారు?ఇదే ఇప్పుడు వనపర్తి రాజకీయాల్లో హాట్ క్వశ్చన్. రాజకీయ వేదికపై ఎవరి మాట గెలిచినా.. కాలువ చివర రైతు పొలంలోకి నీరు చేరితేనే అసలు విజయం. అప్పటివరకు కేఎల్‌ఐ నీళ్లపై ఈ ‘పొలిటికల్ ఫైట్’ కొనసాగే అవకాశమే ఎక్కువని వనపర్తి నియోజకవర్గ మేధావులు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.






