17 April, 2026 | 7:46 PM

తాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలి

17-04-2026 06:28 PM

ప్రతి నివాస ప్రాంతానికి శుద్ధి జలాలు సరఫరా జరగాలి

 అధికారులతో సమీక్షలో కలెక్టర్ ఇలా త్రిపాఠి

అర్మూర్,(విజయక్రాంతి): వేసవి సీజన్ దృష్ట్యా తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ప్రతి నివాస ప్రాంతానికి రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలా నిరంతరం పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని డొంకేశ్వర్, నందిపేట్, మాక్లూర్, ఆలూర్, ఆర్మూర్ మండలాల ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, ఎంపీఓలు, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులతో కలెక్టర్ మంచినీటి సరఫరా తీరుతెన్నులపై కలెక్టర్ సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.

ఒక్కో మండలంలోని ఆయా గ్రామాల వారీగా నీటి సరఫరా పరిస్థితి గురించి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, చేపట్టాల్సి ఉన్న మరమ్మతు పనులు తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది వేసవిలో ఏయే ప్రాంతాలలో దాహార్తి సమస్యలు ఉత్పన్నం అయ్యాయని ఆరా తీశారు. ఈసారి ఎల్ నినో ప్రభావం వల్ల సరిపడా వర్షాలు కురిసే అవకాశాలు లేవని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నందున, తాగునీటి వనరులను సమర్ధవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని జాగ్రత్తలు సూచించారు. ఎక్కడైనా మంచినీటి కోసం ప్రజలు నిరసనకు దిగితే, సంబంధిత ఎం.పీ.డీ.ఓలను బాధ్యులుగా పరిగణిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో, మున్సిపల్ వార్డులలో ప్రజల అవసరాలకు సరిపడా పూర్తి స్థాయిలో రక్షిత మంచినీటి సరఫరా జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు.

చేతి పంపులు, బోరు బావులకు తక్షణమే ఫ్లషింగ్ చేయించాలన్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థకు ఆటంకం కలిగేలా పైప్ లైన్లను ధ్వంసం చేయడం, వాల్వ్ లకు నష్టం చేకూర్చే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, అలాంటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయించాలని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. మంచినీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలని, ఎంపీఓలు, ఏఈలు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాజేందర్, డీపీఓ శ్రీనివాస్ రావు, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఉమా మహేశ్వర్ రావ్, మిషన్ భగీరథ ఈఈ రాకేష్, నియోజకవర్గం పరిధిలోని మండలాల ఎంపీడీఓలు, ఏఈలు, ఎంపీఓలు పాల్గొన్నారు.