25 April, 2026 | 9:33 PM

సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాధ్యం

25-04-2026 08:09 PM

* ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి

ఆమనగల్లు,(విజయక్రాంతి): పేదవాడి సొంతింటి కల కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆమనగల్లు మండల పరిధిలోని శంకర్ కొండ తండాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించుకున్న ఒక ఇంటిని వారు రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, గతంలో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలను కూడా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని, పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ, ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేస్తూ, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేస్తామని వివరించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాములు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జగన్, ముఖ్య నాయకులు భాస్కర్ రెడ్డి, యాదయ్య, రఘురాములు, కేశవులు, విజయ్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.