24 August, 2026 | 4:06 AM

సంబరాల ఏటిగట్టులో అర్జున్‌గా డాలీ ధనుంజయ్

24-08-2026 12:00 AM

సాయిదుర్గతేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’ (ఎస్‌వైజీ) షూటింగ్ మొత్తం పూర్తయింది. నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మించిన ఈ యాక్షన్ డ్రామా, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశను వేగంగా పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రచార చిత్రాలు, వీడియోలతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ఒక అగ్రశ్రేణి బాలీవుడ్ నటుడు కీలక పాత్ర పోషిస్తుండగా, ఐశ్వర్యలక్ష్మి, జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ముఖ్య తారాగణంలో భాగమయ్యారు. నటుడు డాలీ ధనంజయ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

ధనంజయ్ పుట్టినరోజు సందర్భంగా అర్జున్ పాత్రలో ఆయన్ని పరిచయం చేస్తూ చిత్రబృందం ఆదివారం విడుదల చేసిన స్పెషల్ పోస్టర్‌లో ధనుంజయ్ సీరియస్ లుక్ ఆకట్టుకుంటోంది. 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానున్న ఈ చిత్రానికి డీవోపీ: వెట్రి పళనిసామి; సంగీతం: బీ అజనీష్ లోక్‌నాథ్; ఫైట్స్: పీటర్ హెయిన్స్, రామ్ లక్ష్మణ్, చేతన్, పృథ్వీ; ఎడిటర్: నవిన్ విజయ్‌కృష్ణ; ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్.