మధ్య దళారులను నమ్మి మోసపోవద్దు
చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, మే 7 (విజయక్రాంతి) : ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజల హక్కు అని, కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ ద్వారా ప్రభుత్వం ఇచ్చే రూ. లక్ష పేద ఆడపిల్లల కుటుంబాలకు చేరాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జడ్పీ సమావేశం మందిరంలో ఆదిలాబాద్ అర్బన్, మావల, మండలాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి లతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ద్వారా ఇచ్చే పథకాలు కు అధికారులు పూర్తి సహకారం అందించాలన్నారు. ఆడపిల్లల పెళ్లి అయిన వెంటనే మీ సేవ ద్వారా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్ దరఖాస్తు వచ్చిన వెంటనే సంబంధిత అధికారులు విచారణ చేపట్టి త్వరితగతిన ఆ డబ్బులు వారికి అందేలా చర్యలు చేపట్టాలన్నారు. మధ్య దళారులు నమ్మి మోసపోవద్దని సూచించారు.
ఎవరైనా డబ్బులు అడిగిన వెంటనే నేరుగా తనకే సమాచారాన్ని ఇవ్వాలని తెలియజేశారు. అలాగే దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు ఇబ్బందులు గురి చేసిన తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మొహమ్మద్ రోహిత్, కౌన్సిలర్లు, అధికారులు నాయకులు పాల్గొన్నారు.






