సాంకేతికవిద్యను ప్రైవేటీకరించొద్దు
- పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానించొద్దు
- ఏఐఎస్‌ఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి డిమాండ్
హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాం తి): తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా ప్రభుత్వ సాంకేతిక విద్యను ప్రైవేటీకరించే ప్ర యత్నం చేయొద్దని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీకు అనుసంధానం చేయొద్దని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఐటీఐ, ఏటిసిలతో కలిపి డిప్లొమా కోర్సులను అనుసంధానం చేసే విధంగా ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 97ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
స్కిల్ యూనివర్సిటీ పేరిట కొత్త పాలసీ తీసుకువచ్చి ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసే కుట్ర సరికాదని, దీని ద్వారా పాలిటెక్నిక్ విద్యావ్యవస్థ పూర్తిగా అధ్యాపకుల నియామకాల నుంచి మొదలుకొని అడ్మిషన్ల వరకు కూడా మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల్లోకి వెళుతుందని, ఇది నూతన జాతీయ విద్యా విధానం అమలులో భాగమేనని పేర్కొన్నారు.






