19 May, 2026 | 6:21 PM

Breaking News

రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు

19-05-2026 12:00 AM

ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ 

ములుగు (మహబూబాబాద్) మే 18 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లలో తూకం, రవాణాలో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తీసుకుంటామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ అన్నారు. ములుగు జిల్లా జంగాలపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎస్పీ, ములుగు డిఎస్పి రవీందర్, స్థానిక సీఐ, ఎస్‌ఐ  లతో కలిసి సోమవారం సందర్శించారు.

ఈ సందర్భంగా రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు మాట్లాడుతూ, వడ్లను రైస్ మిల్లులకు తరలించేందుకు సరిపడా రవాణా సదుపాయాలు లేక ఆలస్యం జరుగుతోందని, దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. అదేవిధంగా రైస్ మిల్లుల వద్ద కాంటా తూకంలో అధికంగా వడ్లు కట్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.  ముఖ్యంగా కాంటా, నాణ్యత పరిశీలన యంత్రాన్ని, వడ్ల నాణ్యత తనిఖీ ప్రక్రియను పరిశీలించారు.

రైతుల నుండి పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేయాలని, తూకం విషయంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. తూకంలో తేడాలు గమనిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోగల వడ్ల కళాలను స్థానిక పోలీస్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ  రోజువారి ఎగుమతి పై నివేదిక ఉండాలని పోలీసు అధికారులకు సూచించారు.