11 June, 2026 | 1:35 AM

పంట వ్యర్థాలను తగలబెట్టొద్దు

11-06-2026 12:28 AM

జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్

మహబూబాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): పంట వ్యర్థాలను తగలబెట్ట వద్దని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా  పెద్దవంగర మండలం ఉప్పరిగూడెంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ జిల్లాలో రైతులందరూ పంట మా ర్పిడి విధానం, సేంద్రియ ఎరువు వాడకం, ప్రకృతి వ్యవసాయం పై తెలుసుకొని ఆ దిశగా ముందుకు సాగాలని సూచించారు. రైతులకు కావలసిన సమాచారాన్ని పంపి స్తూ భూసార పరీక్షలు నిర్వహిస్తూ, నానో యూరియా వాడకం, సేంద్రియ ఎరువులు, విత్తనాలు, ప్రకృతి వ్యవసాయం పంట మా ర్పిడి విధానంపై పూర్తిస్థాయిలో సమాచారం అందించాలని తెలిపారు.

ప్రస్తుతం కొన్ని కొన్ని ప్రదేశాలలో వరి కొయ్యల కాల్చడం ద్వారా వాతావరణంలో అనేక మార్పులు జరుగుతున్నాయని, అట్టి విధానం ద్వారా భూసారం దెబ్బతింటుందన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు ప్రతి విభాగానికి చెందిన వారోత్సవాలు, అన్ని శాఖల సమన్వయంతో గ్రామసభలు, వార్డు సభలు, మండల సభలు, జిల్లా సభలు, నిర్వహించి ప్రజల వద్ద నుండి వినతులను స్వీకరించడం జరిగింది అని, క్షేత్రస్థాయిలో అధిక శాతం పెన్షన్, భూ సమస్యల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, తదితర ప్రభుత్వ పథకాల అమలుకు దరఖాస్తు చేయడం జరిగిందని అట్టి దరఖాస్తులు అన్నింటిని పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలను అందించడం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఈ గ్రామసభలో  పెద్దవంగర మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి బోడేపూడి వేణుమాధవ్, తహసిల్దార్ వినోద్ కుమార్, సంబంధిత అన్ని విభాగాల అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వయం సహాయక బృందాల సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 

రెండు పడకగదుల నిర్మాణాన్ని పరిశీలించిన కలెక్టర్

మహబూబాబాద్ పట్టణ పరిధిలోని గుమ్మడూరులో నిర్మాణంలో ఉన్న రెండు పడక గదుల ఇండ్లను కలెక్టర్ పరిశీలించారు.