ఫరీద్‌పేట్‌లో అక్రమాలపై డీఎల్‌పీఓ విచారణ
గత సర్పంచ్ హయాంలో రూ.13 లక్షల నిధుల దుర్వినియోగంపై ఆరా
పంచాయతీ అనుమతి లేకుండా ఇంటి నిర్మాణం?
కార్యదర్శి నుంచి వివరాలు సేకరించిన అధికారులు
కలెక్టర్‌కు సమగ్ర నివేదిక అందజేస్తాం: డీఎల్‌పీఓ శ్రీనివాస్
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్‌పేట్ గ్రామ పంచాయతీలో చోటుచేసుకున్న నిధుల దుర్వినియోగం, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై గురువారం జిల్లా పంచాయతీ అధికారి (డీఎల్‌పీఓ) శ్రీనివాస్, మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ) సురేందర్‌రెడ్డి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. గత ప్రజావాణిలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అందించిన ఫిర్యాదుల మేరకు అధికారులు గ్రామానికి చేరుకుని పంచాయతీ రికార్డులను సమగ్రంగా పరిశీలించారు.
రూ.13 లక్షల నిధుల గోల్‌మాల్?
గత సర్పంచ్ హయాంలో సుమారు రూ.13 లక్షల పంచాయతీ నిధులు పక్కదారి పట్టాయని, అభివృద్ధి పనుల్లో భారీగా అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై అధికారులు రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రికార్డుల్లోని వివరాలు, వాస్తవ ఖర్చులపై ఆరా తీశారు.
అనుమతి లేని నిర్మాణంపై ఆరోపణలు
పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గత మూడేళ్లుగా గ్రామ పంచాయతీ ఎలాంటి అనుమతులు ఇవ్వకపోయినా నిబంధనలకు విరుద్ధంగా గృహ నిర్మాణం చేపట్టారని సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి, వార్డు సభ్యురాలు దేవోల్లా ప్రత్యూష అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా, సదరు నిర్మాణానికి జీపీ నుంచి ఎలాంటి అనుమతులు జారీ చేయలేదని స్పష్టం చేశారు.
పన్నులు వసూలు చేసి చర్యలు చేపట్టాలి: గ్రామస్తుల డిమాండ్
అనుమతులు లేకుండా నిర్మించిన గృహానికి చట్టప్రకారం నోటీసులు జారీ చేసి, గత మూడేళ్ల ఇంటి పన్నును పంచాయతీకి జమ చేయించాలని సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి, వార్డు సభ్యులు దేవోల్లా రాములు, స్థానిక యువత అధికారులను డిమాండ్ చేశారు.పంచాయతీ నిధుల దుర్వినియోగం, అక్రమ నిర్మాణాలపై పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించామని, విచారణ నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేసి నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎల్‌పీఓ శ్రీనివాస్ పేర్కొన్నారు.






