మద్యం మత్తు వీడితేనే గ్రామాల అభివృద్ధి ముందుకు.!
- కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): గ్రామాల్లోని యువతతో పాటు సామాన్యులు సైతం మద్యం మత్తును వీడాలని అప్పుడే పల్లెలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యపడుతుందని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. సోమవారం ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ మండలం చందుబట్ల గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ పాల్గొని మాట్లాడారు. గ్రామ సర్పంచ్ తిరుపతి గౌడ్ అధ్యక్షత వహించారు. అధికారులు గ్రామ ప్రజలతో నేరుగా ముఖాముఖి నిర్వహించి సమస్యలు, అభివృద్ధి అవసరాలు, సంక్షేమ పథకాల అమలుపై వివరాలు సేకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మాట్లాడుతూ గ్రామసభలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభాలని పేర్కొన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని తెలిపారు. యువత మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. మద్యం మత్తు, డ్రగ్స్ నుండి యువత విముక్తి పొందితేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మహిళల రక్షణపై జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సురేష్ బాబు, డీఎస్పీ శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






