31 July, 2026 | 4:20 AM

జిల్లా యంత్రాంగం అప్రమత్తం

31-07-2026 01:05 AM

కలెక్టర్ కె. హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 30 (విజయక్రాంతి): జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు. గురువారం అడ ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్, అధికారులతో కలిసి వరద పరిస్థితిని సమీక్షించారు.

ప్రస్తుతం ప్రాజెక్టులోకి సుమారు 37 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 6 గేట్లను రెండు మీటర్ల మేర ఎత్తి 27 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం, ఇన్ఫ్లోఅవుట్ఫ్లోలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

ప్రాజెక్టు నుంచి నీటి విడుదలతో లోతట్టు ప్రాంతాల్లో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని, వాగులు, కాజ్వేలు, లో-లెవల్ వంతెనలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎవరూ రాకపోకలు సాగించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారిని అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.జిల్లా వ్యాప్తంగా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. అత్యవసర సహాయం కోసం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్  8500844365ను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.