22 July, 2026 | 6:47 PM

మరోసారి మూడు నెలలకు రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ

22-07-2026 05:47 PM

ఏర్పాట్లు పూర్తి చేస్తున్న ప్రభుత్వం

బోధన్,(విజయక్రాంతి): ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ రంగంపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఆహార భద్రత కల్పించడం, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడం లక్ష్యంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఈ నిర్ణయంతో లబ్ధిదారులు ప్రతి నెలా రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు, ముందుగానే మూడు నెలల బియ్యం అందుబాటులో ఉండటం వల్ల కుటుంబాలకు కొంత ఆర్థిక, సామాజిక భరోసా కలగనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయం ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం 4,73,329 రేషన్ కార్డులు ఉండగా, ప్రతి నెలా అర్హులైన లబ్ధిదారులకు సుమారు 95.70 లక్షల క్వింటాళ్ల బియ్యం పంపిణీ జరుగుతోంది.

మూడు నెలలకు సంబంధించిన మొత్తం 2,87,12,070 క్వింటాళ్ల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని అన్ని గోదాములకు అవసరమైన బియ్యం నిల్వలను తరలించడం, రేషన్ దుకాణాలకు సరఫరా చేయడం, పంపిణీ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. లబ్ధిదారులు తమ రేషన్ కార్డు, ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణతో నిర్ణయించిన తేదీల్లో సంబంధిత చౌక ధరల దుకాణాలకు వెళ్లి మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి తీసుకోవాలని అధికారులు సూచించారు.

రేషన్ పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు కూడా తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని లక్షలాది మంది రేషన్ కార్డుదారులకు ప్రయోజనం చేకూరనుండగా, పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు పౌర సరఫరాల శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు తమకు కేటాయించిన తేదీల్లోనే బియ్యాన్ని తీసుకుని ప్రభుత్వానికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.