కేంద్ర మంత్రి కార్యాలయంపై కాంగ్రెస్ దాడి యత్నం
కాంగ్రెస్ నాయకులపై సీపీకి ఫిర్యాదు
ముకరంపుర,(విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ స్థానిక కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దాడికి యత్నించారని ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి, కార్పొరేటర్ లు బోయిన్పల్లి ప్రవీణ్ రావు, ఎన్నం ప్రకాష్, కో-ఆప్షన్ సభ్యులు,బీజేపీ నాయకులు కరీంనగర్ పోలీస్ కమిషనర్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
బుదవారం మధ్యాహ్నం 12:15 గంటల సమయంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు50 మందికి పైగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలోకి అక్రమంగా చొరబడి కార్యాలయ సిబ్బందిపై దాడికి యత్నించడం తో పాటు, వారిని అసభ్య పదజాలంతో దూషించారని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ,ఎంపీ ఆఫీస్ లోకి చొరబడి దాడికి యత్నించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సహా ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఈ ఫిర్యాదును స్వీకరించింది.






