22 July, 2026 | 7:28 PM

కుమ్రం భీం భావితరాలకు స్ఫూర్తిదాయకం: డిటిడిఓ జాదవ్ అంబాజీ

22-07-2026 06:15 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా గిరిజన సంక్షేమ శాఖ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి జాదవ్ అంబాజీ బుధవారం కేరమేరి మండలంలోని చారిత్రాత్మక జోడేఘాట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అమరవీరుడుభీం స్మారక స్థూపం వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆదివాసీల హక్కుల కోసం కుమ్రం భీం  చేసిన త్యాగాలు భావితరాలకు ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. అనంతరం జోడేఘాట్ గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు జాదవ్ అంబాజీకి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు.

జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధికి ఆయన విశేష కృషి చేయాలని ఆకాంక్షించారు. జోడేఘాట్ ఆశ్రమ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన డీటీడీఓ విద్యార్థుల హాజరు, తరగతి గదులు, వసతి గృహాలు, భోజనశాల, వంటశాల, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యాభ్యాసం, ఆరోగ్యం, భోజన నాణ్యత, వసతి సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు విద్యార్థులకు సక్రమంగా అందేలా అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

పాఠశాలలో పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని హెచ్చరించారు. విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడంతో పాటు విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ నాణ్యమైన విద్య అందించేందుకు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏటీడీఓ శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, క్యూరేటర్, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.