మూడు రోజుల ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్య శిక్షణ విజయవంతంగా ముగింపు
- ఆధునిక బోధనా విధానాలతో విద్యా ప్రమాణాలు మెరుగుపడాలి: ఎంఈవో నాగయ్య
బోధన్,(విజయక్రాంతి): బోధన్ మండలంలోని అర్బన్, రూరల్ ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఆజాంగంజ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మూడు రోజుల వృత్తి నైపుణ్య శిక్షణ బుధవారం ముగిసింది. ఆధునిక బోధనా పద్ధతులు, అభ్యసన ఫలితాల ఆధారిత బోధన, విద్యార్థి కేంద్రిత కార్యకలాపాలు, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినట్లు మండల విద్యాధికారి నాగయ్య తెలిపారు.
శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో సమర్థంగా అమలు చేసి ప్రతి విద్యార్థి అభ్యసన స్థాయిని పెంపొందించేలా కృషి చేయాలని సూచించారు. రిసోర్స్ పర్సన్స్ సంజీవ్, ప్రీతి, సందీప్ శిక్షణ అందించగా, ఎంఐఎస్ కోఆర్డినేటర్ నాగేష్, సీఆర్పీలు విజయ్, యూసఫ్ సమన్వయం చేశారు. అర్బన్, రూరల్ ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






