పాఠ్యపుస్తకాల పంపిణీ షురూ..
మహబూబాబాద్, మే 25 (విజయక్రాంతి): విద్యాసంవత్సరం ప్రారంభం రోజు నే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేయాలనే ప్రభుత్వ సంకల్పాన్ని నిర్వహించ డానికి జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మహబూబాబాద్ జిల్లాలో 1 నుంచి 10 వ తరగతి వరకు విద్యాబోధన చేసేందుకు ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలలు కలిపి 1,032 ఉండగా, సుమారు లక్ష మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
వీరికి వివిధ రకాల టైటిల్లకు చెందిన 3,92,300 పాఠ్యపుస్తకాలు అవసరమని ప్రభుత్వానికి నివేదిం చగా, కేసముద్రం (వి) జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఏర్పాటుచేసిన జిల్లా పాఠ్య పుస్తక గోదాముకు ఇప్పటివరకు 2,89,570 పాఠ్యపుస్తకాలు వచ్చాయని, జిల్లా విద్యాధికారి ఏ, సత్యనారాయణమూర్తి, పాఠ్యపుస్తక గోదాం మేనేజర్ సిహెచ్. వెంకట్ రామ్ నరసయ్య తెలిపారు. పార్ట్ బి ప్రకారం మరో 84,370 పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉందని వారు తెలిపారు.
పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రారంభం
జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభం కానుండగా, జిల్లాలోని 18 మండలాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్య క్రమాన్ని సోమవారం ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా ప్రారంభించారు. 25న బయ్యారం, గార్ల మండలాల్లోని విద్యాలయాలకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. 26న కురవి, సీరోల్, డోర్నకల్, 28న మరిపెడ, చిన్న గూడూరు, 29న గూడూరు, గంగారం, కొత్తగూడ, 30న నెల్లికుదురు,
నరసింహుల పేట, జూన్ 1న మహబూబాబాద్, 3న కేసముద్రం, ఇనుగుర్తి, 4న దంతాలపల్లి, పెద్దవంగర, తొర్రూరు, 5న జిల్లాల పరిధిలోని అన్ని గురుకుల పాఠశాలలకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా మండలాలకు పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలను మండల విద్యాధికారుల ఆధ్వర్యంలో విద్యార్థుల సంఖ్య ప్రకారం, తరగతుల వారీగా పాఠశాలలకు సరఫరా చేసి, పాఠశాల ప్రారంభం రోజున విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డీఈఓ ఆదేశించారు.






