27 April, 2026 | 3:24 AM

నిరుపయోగం..!

27-04-2026 01:23 AM

మూలన పడ్డ రేషన్ సంచులు

మహబూబాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా తెల్ల రేషన్ కార్డుదారులందరికీ రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి ప్రత్యేకంగా చేతి సంచులను ముద్రించి పంపిణీ చేయడానికి నిర్ణయించింది. ఆ మేరకు గత ఐదు నెలల క్రితం రాష్ట్రవ్యాప్తంగా తెల్ల రంగు రేషన్ కార్డుదారులందరికి సన్న బియ్యంతో పాటు ఉచితంగా చేతి సంచిని ఇవ్వాలని డీలర్లకు కేటాయించింది.

బియ్యం పంపిణీ చేసిన విధంగానే ఆన్లైన్ విధానంలో చేతి సంచులను రేషన్ కార్డు హోల్డర్లకు అందజేయాలని ఆదేశాలు జారీచేసి ఆ మేరకు ప్రతి రేషన్ షాపుకు కేటాయించిన రేషన్ కార్డుల సంఖ్యకు అనుగుణంగా చేతి సంచులను అందజేసింది. అయితే ప్రభుత్వం అందించిన చేతి సంచుల్లో దాదాపు 25 శాతం మేర లబ్ధిదారులు తీసుకోకపోవడంతో రేషన్ షాపుల్లోనే మూలకు పడ్డాయి. ఒక్కో సంచి కనీసం 50 రూపాయలు పైగా ఖర్చుచేసి ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తే వాటిని తీసుకోవడానికి చాలామంది లబ్ధిదారులు అందుబాటులో లేకపోవడం వల్ల తీసుకోలేక పోయారు.

రేషన్ కార్డు కేటాయించిన రేషన్ షాపుల్లోనే చేతి సంచి తీసుకునే విధంగా ఆన్లైన్లో మార్పులు చేయడంతో రేషన్ కార్డు ఉన్నచోట లబ్ధిదారు లేకపోవడం వల్ల చేతి సంచులు మిగిలిపోయినట్లు రేషన్ డీలర్లు చెబుతున్నారు. అనేక మంది పేదలు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వెళ్లి అక్కడే తాత్కాలికంగా నివసించడం, వన్ నేషన్ వన్ రేషన్ అమలులో భాగంగా వారు తమ సమీపంలోని రేషన్ షాపు వద్ద రేషన్ తీసుకునే వెసులుబాటు ఉండటంతో అక్కడే రేషన్ తీసుకుంటున్నారని, దీనితో కార్డు కేటాయించిన రేషన్ షాపుకు రాకపోవడం వల్ల వారికి చేతి సంచులు ఇవ్వలేకపోతున్నట్లు చెబుతున్నారు.

మహబూబాబాద్ జిల్లాలో సుమారు 1.7 లక్షల రేషన్ కార్డులు ఉండగా వారందరికీ ప్రభుత్వం ఉచిత రేషన్ సంచులను అందజేయడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న 550 రేషన్ షాపుల్లో కేటాయించిన కార్డుల సంఖ్యకు అనుగుణంగా చేతి సంచులను పంపించింది. అయితే జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు దాదాపు అన్ని రేషన్ షాపుల్లో 100 నుండి 300 కు పైగా పంపిణీ చేయకుండా మూలకు పడ్డాయి. దీంతో లక్షల రూపాయలు ఖర్చు చేసి సమకూర్చిన చేతి సంచులు మరికొద్ది రోజుల్లో ఎందుకు పనికిరాని విధంగా పాడయ్యే పరిస్థితి దాపురించింది. 

కార్డుదారులు రావడం లేదు

చేతి సంచులు మూలకుపడ్డ సంఘటనలపై రేషన్ డీలర్లను వివరణ కోరగా ఆన్లైన్ విధానంలో కార్డుదారులకు చేతి సంచి ఇవ్వాలని అధికారులు ఆదేశించారని, తమ రేషన్ షాపు పరిధిలో ఉన్న చాలామంది లబ్ధిదారులు ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ ఉండడం వల్ల వారు ఇక్కడికి వచ్చి రేషన్ బియ్యం తీసుకు వెళ్లలేదని దీనితో తమ వద్దే వారికి కేటాయించిన చేతి సంచులు ఉంటున్నాయని చెప్పారు.