27 April, 2026 | 3:21 AM

విద్య.. వ్యాపారమైంది

27-04-2026 01:41 AM
  1. చదువుల పేరుతో చంపేస్తున్నారు
  2. పిల్లల భవిష్యత్ తాకట్టు.. తల్లిదండ్రుల కష్టార్జితం దోపిడీ
  3. ఏడాది సంపాదనంతా ఫీజులకే సరి
  4. మీడియాపై ప్రభావం చూపుతున్న కార్పొరేట్ విద్యాసంస్థలు
  5.   1200 ప్రభుత్వ విద్యాసంస్థలు బలహీనం, 2500 ప్రైవేట్ విద్యాసంస్థలు బలోపేతం
  6. విద్యాహక్కు చట్టం పకడ్భందీగా అమలు చేయాలి
  7. ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాలో ఎమ్మెల్సీ, టీఆర్పీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న

ముషీరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా వ్యాపార ధోరణిలో నడుస్తోందని, పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి తల్లిదండ్రుల కష్టార్జితాన్ని కార్పొరేట్ విద్యా మాఫియా దోచుకుతింటున్నదని , ఫీజులు కాదు భయం అమ్ముతున్నారని టీఆర్పీ అధ్యక్షుడు, ఎ మ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. పేదవాడి కలను చదువుల పేరుతో చంపేస్తున్నారని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలు కొనసాగిస్తున్న అడ్డగోలు ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో ప్రసగిస్తూ ఫీజుల దోపి డీపై కన్నెర్ర చేశారు. ప్రైవేట్ విద్యా దోపిడీని అరికట్టే వరకు ఈ పోరాటం ఆగదన్నారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని, విద్యా ర్థులు, తల్లిదండ్రులకు అన్యాయం జరిగితే ప్రతిస్థాయిలో పోరాడతామని మల్లన్న స్పష్టం చేశా రు.

ప్రైవేట్ విద్యాసంస్థలు అడ్మిషన్లు, స్పెషల్ ఫీజులు, డొనేషన్లు, బస్ ఫీజులు, మెటీరియల్ ఛార్జీలు వంటి పేర్లతో లక్షల రూపాయలు వసూ లు చేస్తున్నాయని, ఒక మధ్యతరగతి కుటుంబం ఆదాయం కంటే పిల్లల చదువు ఖర్చు ఎక్కువయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక రైతు ఏడాది సంపాదన మొత్తం పిల్లాడి ఒక్క సంవత్సరపు ఫీజుకే సరిపోతే, ఇది విద్యా వ్యవస్థ ఎలా అవుతుందని, బహిరంగ దోపిడీ వ్యవస్థ అవుతుందని అన్నారు.

ఈ నిరసన కార్యక్రమానికి ప్రధాన మీడియా సంస్థలు రాలేదన్నారు. ఈ సమస్యను ప్రజల ముందుకు తీసుకువెళ్లడంలో ఈ సంస్థలు విఫలమవుతున్నాయని ఆరోపించారు. కార్పొరేట్ విద్యాసంస్థలు యాడ్స్ రూపంలో భారీగా ఖర్చు చేసి మీడియాపై ప్రభావం చూపుతున్నాయని, అందుకే ప్రజా సమస్యలు బయటపడకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో ఫీజుల నియంత్రణ వ్యవస్థలు కఠినంగా అమల్లో ఉన్నాయని చెప్పారు.

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు 1200 బలహీనపడుతుండగా, 2500 ప్రైవేట్ విద్యాసంస్థలు మాత్రం బలపడుతున్నాయని అన్నారు. ప్రభుత్వ తీరు కార్పొరేట్ విద్యకు మార్గం సుగమం చేస్తోందని విమర్శించారు. ఫీజులపై కఠిన నియంత్రణ, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత, పేద విద్యార్థులకు విద్యాహక్కు చట్టం పూర్తిగా అమలు చేయాలని మల్లన్న డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులు, ఎంబీటీ నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.