27 April, 2026 | 1:26 AM

మండలస్థాయికి ప్రజావాణి

27-04-2026 12:19 AM
  1. రెవెన్యూ డివిజన్ స్థాయి తర్వాత మండలస్థాయికి విస్తరించాలి  
  2. ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలి 
  3. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేయడంతో ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్‌కు, జిల్లా కేంద్రానికి వచ్చే బదులు ప్రజావాణి సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు.

ఈ మేరకు ఆదివారం ఉదయం ఎంసీహెచ్‌ఆర్డీలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో అధికారు లను ఆదేశించారు. వెంటనే రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి ప్రారంభించాలని తరువాత దశలో మండలస్థాయికి ప్రజావాణిని విస్తరించాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అన్ని స్థాయిల్లో అధికారులకు పూర్తి అధికారాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు.

ప్రజలు ఇచ్చే ప్రతి ఫిర్యాదును నమోదు చేయాలని, సంబంధిత విభాగాలకు పంపించాలన్నారు. పరిష్కార పురోగతిని అర్జీదారునికి తెలియజేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యా దుల పరిష్కారానికి నిర్ణీత గడువులు ఉండాలని, ఆలస్యం జరగకూడదని చెప్పారు. ఫిర్యా దుల నమోదు, ట్రాకింగ్, పరిష్కారానికి ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫామ్ అభివృద్ధి చేయా లని ఆదేశించారు.

జిల్లా, రాష్ట్రస్థాయిల్లో రియ ల్ టైమ్ మానిటరింగ్ ఉండాలని సూచించారు. ప్రతి స్థాయిలో ప్రజావాణికి ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలన్నారు. ప్రతి జిల్లాలోనూ, ప్రతిశాఖలో ప్రత్యేక ప్రజావాణి విభాగాలు ఏర్పాటు చేయాలని చెప్పా రు. ఒకస్థాయిలో పరిష్కారం కాకపోతే, పైస్థా యి అధికారికి అర్జీ అందేలా ఆటో ఎస్కలేషన్ వ్యవస్థను అమలు చేయాలని చెప్పారు. అవసరమైతే అప్పీల్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించారు.

బాధ్యులుగా అధికారులు.. 

ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియలో ఎలాంటి రాజీ ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పెండింగ్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. డ్యాష్‌బోర్డు  ద్వారా పరిష్కార పురోగతి తెలుసుకునే వీలుండాలని, ఎక్కడైనా ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని చెప్పారు.

ప్రజావాణి సేవలను వికేంద్రీకరించటంతో జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో పెండింగ్ అర్జీల సంఖ్య తగ్గుతుందని, కిందిస్థాయిలోనే కొన్ని పరిష్కరించే వీలుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రజలకు నమ్మకంగా ఉండేలా ప్రజావాణి సేవలు అందించాలని సూచించారు.

ప్రజాభవన్‌లో విజయవంతంగా..

ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన మరుసటి రోజే 2023 డిసెంబర్ 8వ తేదీన ప్రజావాణి కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి మంగళవారం, శుక్రవారం మహాత్మా జ్యోతిభాఫూలే ప్రజాభవన్‌లో ప్రజావాణి విజయవంతంగా అమలవుతోంది.

అన్ని విభా గాలకు చెందిన అధికారులు అక్కడికక్కడే ప్రజ లు ఇచ్చే అర్జీలు, దరఖాస్తులను స్వీకరించి వేగవంతంగా వాటిని పరిష్కరించే చర్యలు చేపడు తున్నారు. జిల్లా స్థాయిలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతివారం ప్రజావాణి నిర్వహి స్తున్నారు.