మిస్టరీగా మారిన గద్వాల విద్యార్థిని అదృశ్యం
గద్వాల్: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఓ మైనర్ బాలిక అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని తిరిగి రాకపోవడంతో మిస్టరీ నెలకొంది. ఈ ఘటన గద్వాల పట్టణం భవానినగర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గద్వాల పట్టణంలో భవానినగర్ లో నివసిస్తున్న కృష్ణవేణి రేవులపల్లి ప్రభుత్వ స్కూల్ లో ఉపాధ్యాయురాలుగా పని చేస్తోంది. ఆమెకు రుత్విక అనే పదమూడేండ్ల కూతురు ఉంది.
రుత్విక ఇండో ఇంగ్లీష్ హై స్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. గురువారం ఉదయం కృష్ణవేణి తన కూతురు రుత్వికకు బై చెప్పి డ్యూటికి వెళ్లింది. ఇంట్లో వయోవృద్దురాలు, రుత్వికమాత్రమే ఉండగా, స్కూల్ కు వెళ్తున్నట్లు చెప్పి రుత్విక వెళ్లిపోయింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన కృష్ణవేణి , రుత్విక పాఠశాల నుంచి రాకపోవడంతో స్కూల్ లు వెళ్లి ఎంక్వైరీ చేసింది. స్కూల్ కు రాలేదని చెప్పడంతో తల్లి ఆందోళన చెందింది. బంధువులు, స్నేహితుల ఇళ్లలో గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో బాధితురాలు గద్వాల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీసీటీవీ పుటేజీలో కీలక ఆధారాలు
రంగంలోకి దిగిన గద్వాల టౌన్ పోలీసులు గద్వాల పట్టణంలోని ప్రధాన కూడళ్లు, ఆర్టీసీ బస్టాండ్‌లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కర్నూలు నుండి వచ్చిన ఒక గుర్తుతెలియని మహిళతో కలిసి బాలిక రెండు లగేజ్ బ్యాగ్ లతో కలిసి గద్వాల బస్టాండ్‌లో హైదరాబాద్ బస్సు ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు హైదరాబాద్‌లోని ఎం జి బి ఎస్ బస్టాండ్ లో సీసీటీవీ దృశ్యాలను కూడా పరిశీలించారు. అక్కడ సదరు మహిళతో కలిసి బాలిక బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి.
గుర్తు తెలియని మహిళ పై అనుమానాలు?
బాలికతో పాటు ఉన్న ఆ మహిళ ఎవరు? ఆ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? కర్నూలు నుండి వచ్చిన మహిళ గద్వాల బాలికను ఎందుకు తీసుకెళ్లింది? అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు.
పోలీసుల విజ్ఞప్తి:
ఈ ఘటనపై గద్వాల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. గుర్తుతెలియని మహిళతో బాలిక వెళ్లడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక ఆచూకీ తెలిసిన వారు లేదా ఆ మహిళను గుర్తించిన వారు వెంటనే గద్వాల టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.




