19 August, 2026 | 12:10 AM

ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయినా.. నా కథలు గుర్తుండిపోవాలనుకుంటా!

18-08-2026 11:03 PM

రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రమిది. ఇందులో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబి నక్షత్ర కీలక పాత్ర పోషిస్తోంది. ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్ర విశేషాలను దర్శకుడు శివ నిర్వాణ విలేకరులతో పంచుకున్నారు. 

ఈ సినిమాలో రామ్‌చరణ్ కనిపిస్తారనేది సోషల్ మీడియా ప్రచారమే. రామ్‌చరణ్ అయ్యప్ప భక్తుడు. ఆయనకు ఆ వైబ్ వుంటుంది. బహుశా అభిమానులు అలా కోరుకున్నారేమో. కానీ ఇందులో చరణ్ కనిపిస్తారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. ఈ సినిమా రామ్‌చరణ్‌కు నచ్చాలని కోరుకుంటున్నా. 

ఈ సినిమాలో మొత్తం మూడు లేయర్స్ ఉంటాయి. ఒకటి అయ్యప్ప స్వామి మాల నేపథ్యం, అలాగే ఫ్యామిలీ, మరొకటి క్రైమ్ యాంగిల్. ప్రేక్షకుల అంచనాలను సినిమా ఖచ్చితంగా అందుకుంటుంది. 

ఎవరూ టచ్ చేయని పాయింట్ చెప్తున్నప్పుడు ఒక యాక్టర్ చేస్తే ఒకలా ఉంటుంది. అదే ఒక స్టార్ చేస్తే దాని రీచ్ మరోలా ఉంటుంది. ఇలాంటి కథను రవితేజ లాంటి స్టార్ హీరోతో చేసినప్పుడు ఆ కథ ప్రతి ఇంటికీ చేరుతుంది.

-అయ్యప్ప స్వామి బ్యాక్‌గ్రౌండ్‌లో, ముఖ్యంగా దక్షిణాదిన చాలా తక్కువ సినిమాలు వస్తున్నాయి. రవితేజ లాంటి స్టార్ హీరోతో ఇలాంటి సినిమాను మనం చూడలేదు. ఇలాంటి అంశాలతో చాలా తక్కువ సినిమాలుంటాయి కాబట్టి, అప్పటివరకు వచ్చిన ఏదో ఒక సినిమాతో పోలిక అయితే ఉంటుంది. అలాగే ‘మాలికాపురం’తో పోలిక వచ్చింది. అయితే నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే నా సినిమా కంటెంట్ ఏంటో నాకు తెలుసు. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇది చాలా యూనిక్ ఫిల్మ్ అని ప్రేక్షకులే చెప్తున్నారు.  

-నేను ఈ కథ అనుకున్న తర్వాత అయ్యప్ప స్వామి మాల గురించి చాలామందిని అడిగి అన్ని విషయాలు తెలుసుకున్నా. అయితే ఎంతమందిని అడిగినా సరే ఏదో ఒక అసంతృప్తి ఉండేది. అందుకే ఈ సినిమా కోసం మాల కూడా వేశా. ఫిలింనగర్ పడిపూజలకు వెళ్లా. గురుస్వాములను కలిశా. అంతకుముందు దర్శకుడు హను రాఘవపూడితో శబరిమల వెళ్లా. ఇందులో మంగళహారతులు, భజనలు, రుద్రాక్షలు వేసుకునే విధానం... అన్నీ చాలా ప్రామాణికంగా ఉంటాయి.

-ఈ కథ అనుకున్నప్పుడు ఎవరినీ మనసులో అనుకోలేదు. కాకపోతే ఇది రవితేజకు చెప్పిన తర్వాత ఈ పాత్రకు సరిగ్గా సరిపోతారు అనిపించింది. ఆయన గడ్డం, తేజస్సు ఈ పాత్రకు అద్భుతంగా సరిపోయాయి. -రవితేజ చాలా కూల్‌గా ఉంటారు. కథను ఓకే చేసిన తర్వాత దర్శకుడికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చేస్తారు. ఎవరిపైనా ఒత్తిడి పెట్టరు. ఆయన ఒత్తిడి తీసుకోరు.

సీలేరు ప్రాంతంలో -15 ఏళ్లుగా పడిపూజల్లో ప్రతి అయ్యప్ప భక్తులు పాడుకునే పాట ‘మల్లెపూల పల్లకి’. ఇప్పటివరకు మనం ఎవరి గొంతుతో వింటున్నామో, ఆయనతోనే ఈ పాట పాడిస్తే బాగుంటుందని టీమ్ అంతా భావించాం. జీవీ ప్రకాశ్ అనుకుంటే దేశంలో ఏ సింగర్ అయినా వచ్చి పాడుతారు. కాకపోతే మేము అభిమానుల మనోభావాలను గౌరవిస్తూ, ఒరిజినల్‌గా పాట పాడిన డప్పు శ్రీనుతోనే పాడించాం. డప్పు శ్రీను గొంతుతోనే ఈ పాట చిరస్థాయిగా ఉంటుంది.  

ఈ సినిమాలో ‘మనెమ్మ’ క్యారెక్టర్‌కు ఒక మట్టి వాసన కావాలి. మన ఇంట్లో పాపలాగా ఉండాలి. అలాంటి పాప కోసం వెతుకుతున్నప్పుడు ఇన్‌స్టాలో బేబీ నక్షత్ర రీల్స్ కనిపించాయి. తన లుక్ టెస్ట్ చేసి చూశాం. రెండు వీడియోలు షూట్ చేశాం. నక్షత్ర పర్‌ఫెక్ట్‌గా సరిపోతుందనిపించింది. 

-ప్రతి కథను తీవ్రంగా చెప్పాలనేదే నా ఉద్దేశం. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి నా గత చిత్రాలన్నీ మళ్లీమళ్లీ చెప్పుకునేలాగా ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయినప్పుడు కూడా నా కథలు గుర్తుండిపోవాలనేది నా ఉద్దేశం. అలాంటి ఇంటెన్సిటీ ప్రేమకథలో కొంతవరకు దొరుకుతుంది. ‘ఇరుముడి’లో కూడా ఒక క్రైమ్ యాంగిల్‌లో ఒక అద్భుతమైన కథ దొరికింది. అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు హీరో ఎలా ఉంటారు, మాలలో లేనప్పుడు ఎలా ఉంటారనేది చాలా అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ముందుకు వెళ్తుందీ కథ. ఇది అయ్యప్ప స్వామి మాల బ్యాక్‌డ్రాప్‌లో ఉండే కథే కానీ, అయ్యప్ప స్వామి కథ కాదు.  

మాంటేజ్ సాంగ్స్ స్వయంగా డైరెక్ట్ చేయడం -నా మొదటి సినిమా నుంచి నాకున్న అలవాటు. నేను షూటింగ్ చేస్తున్నప్పుడే కొన్ని మాంటేజ్‌లు తీసుకొని పెట్టుకుంటా. అవన్నీ ఎడిటింగ్‌లో యూజ్ చేస్తుంటా. దానివల్ల ఆ ఊరు, ఆ ప్రాంతం మొత్తం ఆ కథలో తిరుగుతున్నట్టుంటుంది.  

‘ఇరుముడి’ అనే టైటిల్ ముందు అనుకున్నదే. ఇందులో తండ్రికీ, కూతురికి.. అయ్యప్ప భక్తుడికీ, మాలకు.. అలాగే ఒక క్రైమ్ ఎలిమెంట్‌కు ముడి ఉంది. ఈ మూడు ముళ్లను కలిపి ‘ఇరుముడి’ అని అనుకున్నా.