పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో
నిర్మల్,(విజయక్రాంతి): పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు నష్టం కలిగించే విధంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ విద్యార్థులు మంగళవారం వస్తారోకో నిర్వహించారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాల ఎదుట కానాపూర్ నిర్మల్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సాంకేతిక విద్యా వ్యవస్థను యథాతథంగా కొనసాగిస్తూ పాలిటెక్నిక్ విద్యను మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ జీవో నెంబర్ 97 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు అమృత్ చారి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మార్పుల వల్ల పాలిటెక్నిక్ కళాశాలల ఉనికికి, విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్నాయని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యను ఇతర సంస్థల్లో విలీనం చేయడం ద్వారా ఇంజనీర్ కావాలనే లక్ష్యంతో ఉన్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సాయి అక్షయ్, పవన్, కార్తీక్, రామ్ చరణ్, అలీషా, వంశీ, పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొన్నారు.






