టేకులపల్లి మండలంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు
టేకులపల్లి, ఆగస్టు 18,(విజయక్రాంతి): టేకులపల్లి మండలంలో ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన మంగళవారం ప్రారంభమైంది. పర్యటనలో భాగంగా పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన పనుల ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మొక్కంపాడు గ్రామంలో సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రామచంద్రునిపేట గ్రామపంచాయతీ పరిధిలోని పాతర్లగడ్డ గ్రామంలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన పైప్ కల్వర్ట్ను ప్రారంభించారు. అనంతరం రామచంద్రునిపేట గ్రామంలో రూ.35 లక్షల వ్యయంతో చేపట్టనున్న పైప్ కల్వర్ట్, సైడ్ డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
అంతకుముందు టేకులపల్లి లోని కస్తూర్బా గురుకుల పాఠశాలను, బద్దుతండాలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలు ఆకస్మికంగా తనికి చేశారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లక్కినేని శ్యామ్, ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కోరం సురేందర్, మొక్కంపాడు సర్పంచ్ సురేష్, రామచంద్రునిపేట సర్పంచ్ వాసం సువర్ణ, ఉప సర్పంచ్ వాసం రాఘవేందర్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువజన, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.






