26 August, 2026 | 2:00 AM

ఆత్మగౌరవం ఇప్పుడు గుర్తొచ్చిందా?

26-08-2026 12:29 AM
  1. రేవంత్ విదేశీ పర్యటనను ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలి
  2. బీజేపీ, సీఎం వాస్తవాలు బయటపెట్టాలి
  3. రేవంత్‌వి చిల్లర రాజకీయాలు  
  4. క్యాబినెట్‌లోనే సయోధ్య లేదు
  5. బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్. ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి 30 నెలల తరువాత తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధా కార్యదర్శి ఆర్‌ఎస్.ప్రవీణ్ కుమార్ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాల్లో ప్రభుత్వం విఫలమైనా, ఇప్పుడు విదేశీ పర్యటనను అడ్డుకోవడాన్ని తెలంగాణ ఆత్మగౌరవ అంశంగా చిత్రీకరిస్తున్నారని పేర్కొన్నారు.

రేవంత్ విదేశీ పర్యటనకు కేంద్రం అనుమతి ఎందుకు నిరాకరించిందో సీఎం, బీజేపీ నేతలు బటయపెట్టాలని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ విదేశీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించకుండా రాజకీయ విమర్శలకు దిగుతూ ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారని విమర్శించారు.  సీఎంలు, మంత్రులకే కాదు.. బ్యూరోక్రాట్లకు కూడా విదేశీ పర్యటనలకు పొలిటికల్ క్లియరెన్స్ ఉండాలన్నారు.

వైట్ పాస్ పోర్ట్, బ్లూ పాస్ పోర్టు రెండు ఉంటాయని రేవంత్‌కు తెలియ దా? అని ప్రశ్నించారు. వైట్‌పాస్ పోర్ట్ అంటే డిప్లమాటిక్ పాస్‌పోర్ట్ అని, దాంతో ప్రయాణించినపుడు విదేశాంగ శాఖకు తన పర్యటన వివరాలన్నీ 15 రోజుల ముందే తెలియజేయా ల్సి ఉంటుందన్నారు.

మన విదేశాంగ విధానానికి అనుగుణంగా నేతల షెడ్యూల్ ఉంటేనే విదేశీ పర్యటనలకు అనుమతిస్తారని పేర్కొన్నారు. కేటీఆర్, హరీశ్‌రావుల విదేశీ పర్యటలనకు లేని అభ్యంతరాలు తన విషయంలోనే ఎందుకని రేవంత్ ప్రశ్నించడం హాస్యస్పదమన్నారు. కేటీఆర్, హరీశ్.. సీఎంలు, మంత్రులు కారని, వ్యక్తిగత హోదాలో విదేశాలకు వెళ్తే ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు. 

బీజేపీ, కాంగ్రెస్ డ్రామాలు   

రేవంత్ విదేశీ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిన విషయంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆడుతునాయని ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు.  అనుమతి నిరాకరించడానికి కారణాలను బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తుందన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం కూడా సీఎంల విదేశీ పర్యటనలను అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయన్నారు.  తెలంగాణ ఆత్మగౌరవం గురించి 30 నెలల తరువాత మాట్లాడుతున్న సీఎంకు.. గోదావరి జలాలు ఏపీకి తరలి వెళ్తుంటే ఏమైందని ప్రశ్నించారు.

వివిధ శాఖల్లో ఏపీ అధికారులను ఉన్నత స్థానాల్లో కూర్చో బెట్టినప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం ఏమైందని నిలదీశారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు రేవంత్‌కు తెలంగాణ ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. బీజేపీ, జనసేన ఎంపీల కొడుకులు తప్పుడు పనులు చేస్తే రేవంత్‌రెడ్డి వారిని కాపాడే ప్రయత్నం చేశారని, అప్పుడు ఆత్మగౌరవం ఎటుపోయిందన్నారు. 

కారణాలు బయటపెట్టాలి

రేవంత్ విదేశీ పర్యటనను ఆపడానికి బలమైన కారణాలు ఉన్నాయని, అవేమిటో రేవంత్, బీజేపీ నేతలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కూడా గతంలో విదేశీ పర్యటనలు చేశారు ..అన్ని నిబంధనలు పాటించారు గనుకే ఆయన పర్యటనకు ఎప్పుడూ అడ్డంకులు ఎదురుకాలేదన్నారు. క్యాబినెట్‌లోనే సమన్వయం లేదని, రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఇక్కడి యూనివర్సిటీలు బాగు చేసేందుకు విదేశాలకే వెళ్లాల్సిన అవసరం లేదని, ఇకనైనా వాస్తవాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నేత కురువ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

రేవంత్ ఆత్మ ఫ్యూచర్ సిటీలోనే..

రేవంత్ రెడ్డి ఆత్మ ఫ్యూచర్ సిటీలోనే ఉందని ప్రవీణ్‌కుమార్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులకు 3 వేల ఎకరాల భూములు ఫ్యూచర్ సిటీలో ఉన్నాయని, ఆ ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ కోసమే రేవంత్ విదేశీ పర్యటన ఉందన్నారు. వెనుకబడిన వర్గాలు, దళిత గిరిజనులకు మంచి విద్యను అందించేందుకు తాను విదేశీ పర్యటనలకు వెళ్తున్నానని అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు.

యూకే, యూఎస్ యూనివర్సిటీలేవీ వేరే దేశాల్లో క్యాంపస్‌లు పెట్టవని, అయినా ఇప్పుడు యూకే, యూఎస్‌లలో వేసవి సెలవులు ఉన్నాయన్నారు. అక్కడ ప్రొఫెసర్లు అందరూ సెలవుల్లో ఉంటారని,అక్కడకు వెళ్లి ఎవరిని కలుస్తారు? అని ప్రశ్నించారు.  ముందు ఉస్మానియా యూనివర్సిటీని బాగు చేయాలని, వెయ్యి కోట్ల విడుదల చేసి మాట నిలుపుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ డబ్బుతో విదేశాలకు వెళ్లి పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. రేవంత్ హార్వర్డ్ యూనివర్సిటీలో చదవడానికి కోటి రూపాయల ఖర్చు అయిందని, దాంతో ఎవరికీ లాభం లేదన్నారు.