27 April, 2026 | 5:55 PM

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి: గిరిజన సంఘం

27-04-2026 03:58 PM

గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్

కొల్లాపూర్ రూరల్: కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాల వారి తండాల్లో ఉన్న పోడు భూములకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో కొల్లాపూర్ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాల్యానాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ... కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాల్లోని తండాల్లో నివసిస్తున్న లంబాడీలు, చెంచు గిరిజనులు సాగు చేస్తున్న సుమారు 200 ఎకరాల పోడు భూములకు ఇప్పటివరకు పట్టాలు ఇవ్వలేదని ఆరోపించారు.

ఒకవైపు అధికారులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుండగా, మరోవైపు అటవీ శాఖ అధికారులు వచ్చి గిరిజనులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు మండిపడ్డారు. పోడు భూముల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి సాగు చేస్తున్న గిరిజనులకు హక్కులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కొల్లాపూర్ ఆర్డీవో బన్సీలాల్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం కొల్లాపూర్ మండల అధ్యక్షుడు శ్రీను నాయక్, మండల కార్యదర్శి తిరుపతి నాయక్ మరియు వివిధ తండాల నుంచి పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.