2 March, 2026 | 4:23 AM

రియల్టర్ల కోసమే ఇళ్ల కూల్చివేత!

02-03-2026 02:27 AM
  1. రేవంత్‌రెడ్డిది ప్రజావ్యతిరేక ప్రభుత్వం
  2. ఖమ్మంలో గడ్డపార రాజ్యం
  3. అర్ధరాత్రి అమానుషంగా పేదల గెంటివేత
  4. 4,000 మంది పోలీసులతో పేదల గుడిసెలపై దౌర్జన్యం
  5. కోర్టు ఆదేశాలూ బేఖాతరు
  6. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

ఖమ్మం, మార్చి 1 (విజయక్రాంతి): రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం నిరు పేదల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపు రాజు రాంచందర్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా వెలుగుమట్ల ప్రాంతంలో ఆశ్రయం కోల్పోయిన భూదాన బాధితులను ఆయన పరామర్శించారు.

న్యాయస్థానం ఆదేశాలను ఖాతరు చేయకుండా తెల్లవారుజా మున భారీ బలగాలతో చిన్నారులు, వృ ద్ధులు అని చూడకుండా పేదలను వీధిన పడేయడం దారుణమని మండిపడ్డారు. బాధితులందరికీ అక్కడే నివాస స్థలాలు కేటాయించి, పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులు తమ గోడును రాంచందర్‌రావు ముందు వెళ్లబోసుకున్నారు. వారం రోజుల నుంచి ఖమ్మంలో భూదాన యజ్ఞ సంస్థ నిర్వాసితుల ఆక్రంధన యావత్తు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోం దని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఖమ్మం వెలుగుమట్ల ప్రాంతంలోని భూకొలత సంఖ్య నూట నలభై ఏడు, నూట నలభై ఎనిమిది, నూట నలభై తొమ్మిది భూముల్లో గత పదిహేను సంవత్సరాలుగా దాదాపు 600 పేద కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 1800 మందికి పైగా నిరుపేదలు కూలి పను లు చేసుకుంటూ పైసాపైసా కూడబెట్టుకుని వంద గజాల చొప్పున స్థలాన్ని ఏర్పాటు చేసుకుని చిన్నపాటి గుడిసెలు నిర్మించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస కనికరం లేకుండా ఆ ఇళ్లను నేలమట్టం చేసిందని రాంచందర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉన్నత న్యాయస్థానం యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆ ఆదేశాలను ఏమాత్రం ఖా తరు చేయలేదని ఆరోపించారు. ఆ పత్రాలు అసలైనవి కావని కుంటిసాకులు చెబుతూ పేదల ఇళ్లపై భారీ యంత్రాలను ప్రయోగించారని మండిపడ్డారు. అనంతరం ఖమ్మం నగరంలోని అంబేడ్కర్ భవనంలో తలదాచుకున్న బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ కష్టకాలంలో వారికి బీజేపీ పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

పక్కనే జాతీయ రహదారి రావడం వల్ల భూమి విలువ పెరిగిందని, అధికార వర్గాలకు అత్యంత సన్నిహితులైన స్థిరాస్తి వ్యాపారులకు ఆ భూములను కట్టబెట్టేందుకే దాడులు చేశారని విమర్శించారు. తెల్లవారుజామున నాలుగు గంటల సమ యంలో 4000 మంది భద్రతా బలగాలతో దౌర్జన్యంగా నిరుపేదల గూడు చెదరగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణులు, వృద్ధులు, పసిపిల్లలు, రోగులు అని కూడా చూడకుండా, ఉజ్వల భవిష్యత్ ఉన్న విద్యార్థులను సైతం అమానుషంగా లాగి బయట పడేశారని ధ్వజమెత్తారు.

పేదలు తమ రెక్కల కష్టంతో కొనుగోలు చేసుకున్న నిత్యావసర వస్తువులు, బియ్యం బస్తాలు, కాయగూరలు, పప్పు దినుసులు, పిల్లల చదువుల పుస్తకాలు అన్నీ శిథిలాల కింద కలిసిపోయాయని విచారం వ్యక్తం చేశారు. కనీసం ఆ వస్తువులను బయటకు తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా వ్యవహరించడం శోచనీయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతిలో గునపం పట్టుకుని ఏ ఇల్లు కనిపిస్తే ఆ ఇల్లు కూలగొడుతున్నారని రామచంద్రరావు దుయ్యబ ట్టారు. ఇది ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం ఏమాత్రం కాదని, పూర్తిగా ప్రజావ్యతిరేక ప్రభుత్వమని ధ్వజమెత్తారు.

బాధితుల తరఫున పోరాటం చేస్తాం..

బీజేపీ ఎల్లప్పుడూ అణగారిన వర్గాల ప క్షాన నిలబడుతుందని ఉద్ఘాటించారు. బాధితులకు అదే స్థలంలో వంద గజాల చొప్పున స్థలాలు ఇచ్చి, ప్రభుత్వమే తన సొంత ఖర్చులతో వారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు పోరాటం నిరంతరం కొనసాగుతుందని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

త్వరలో స్థానిక ప్రజలతో కలిసి భారీ ఎత్తున ఉద్యమిస్తామని పాలకులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు, జిల్లా ఇన్‌చార్జి బద్ద మహిపాల్‌రెడ్డి, నాయకులు కొం డపల్లి శ్రీధర్‌రెడ్డి, ఉప్పర్ల శారద, గల్లా సత్యనారాయణ, శీలం పాపారావు తదితరులు పాల్గొన్నారు.