21 March, 2026 | 3:42 AM

సర్టిఫికెట్ల జారీకి కాలయాపన!

21-03-2026 12:23 AM

ఆదాయం, కులం, నివాసం, నాన్-క్రీమిలేయర్ వంటి అనేక సర్టిఫికెట్లు జారీ చేయాల్సిన సంబంధిత అధికారులు కాలయాపన చేయడంతో విద్యార్థులు, నిరుద్యోగులు తహసిల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం సర్టిఫికెట్ల జారీకి ప్రత్యేకంగా ఆన్‌లైన్ విధానం ప్రవేశపెట్టినప్పటికీ, క్షేత్రస్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో జారీలో ఆలస్యం జరుగుతోంది.

  1. తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

పట్టించుకునే వారెవరని విద్యార్థులు, నిరుద్యోగులు ఆవేదన

సర్టిఫికెట్ల కోసం ఎదురుచూపులు

అలసత్వం వహిస్తున్న ఉద్యోగులు

కుమ్రంభీం ఆసిఫాబాద్, మార్చి 20 (విజ యక్రాంతి): ప్రభుత్వం సర్టిఫికెట్ల జారీని సులభతరం చేసేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటు న్నప్పటికీ, అధికారుల తీరు మాత్రం మారడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన ఓ యువతి ఆదాయ సర్టిఫికెట్ కోసం ఈ నెల 4న దరఖాస్తు చేసుకోగా, 20వ తేదీ వరకు  వెరిఫికేషన్ జరగక పోవడం గమనార్హం.

మండలంలోని ఇప్పల నవేగం గ్రామానికి చెందిన ఓ యువకుడు కుల సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకొని తొమ్మిది రోజులుగా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. అతని దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్సీ ఓటీఆర్ గడువును ఈ నెల 25వ తేదీ వరకు విధించడంతో నిరుద్యోగులు సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండగా, 21, 22 తేదీలు సెలవులు రావడంతో నిరుద్యోగుల్లో మరింత ఆందోళన నెలకొంది. తహసిల్దార్ కార్యాలయ ఉద్యోగుల తీరుతో నిరుద్యోగులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది దరఖాస్తులు కార్యాలయంలో దొరకకపోవడం గమనార్హం. పై అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న కాలయాపనను గుర్తించి సర్టిఫికెట్ల జారీ ని వేగవంతం చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.

ప్రక్షాళన జరుగుతుందా...?

జిల్లా కలెక్టర్‌గా హరిత బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కార్యాలయాలను ఆకస్మికం గా తనిఖీలు చేస్తున్నప్పటికీ, పలు శాఖల్లో మాత్రం మార్పు అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. గురుకుల, ఆశ్రమ పాఠశాలలు, ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించిన సందర్భాల్లో లోపాలు గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురిపై కలెక్టర్ ఆగ్ర హం వ్యక్తం చేయడంతో పాటు చర్యలు కూడా తీసుకున్నారు.

జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటిస్తూ అధికారుల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నప్పటికీ, రెవెన్యూ శాఖలో మాత్రం మార్పు కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఆరోపణ లు ఎక్కువగా ఎదుర్కొంటున్న రెవెన్యూ శాఖ లో ప్రక్షాళన జరుగుతుందా అనే చర్చ కొనసాగుతోంది.

జిల్లాలోని పలు మండలాల్లో సర్టిఫికెట్ల జారీ, భూముల విరాసత్, పట్టా పాస్బుక్కుల జారీలో తహసిల్దార్ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల పెంచికల్పేట్ మండల తహసిల్దార్ కార్యాలయంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని రైతుల నుండి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలపై విధుల నుండి తొలగించారు.

ఉన్నత అధికారులు క్షేత్రస్థాయి లో మరింత దృష్టి సారిస్తే ఇంకా అవినీతిపరులు బయటపడే అవకాశం ఉంది. ప్రతిరోజు తహసిల్దార్ కార్యాలయాల చుట్టూ దరఖాస్తుదారులు తమ సమస్యల పరిష్కారం కోసం రోజుల తరబడి తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రెవెన్యూ శాఖపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.