9 July, 2026 | 1:24 AM

ఫౌజీ షూటింగ్‌లో తీవ్ర విషాదం

09-07-2026 12:28 AM

రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు రాజేశ్ శర్మ షూటింగ్ సెట్లో ప్రమాదానికి గురై, ప్రస్తుతం కోల్కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత రాజేశ్ శర్మ సెట్లోని టెక్నీషియన్లతో మాట్లాడుతుండగా ఆయన కుడికాలి పాదంపై ఒక విషపురుగు కుట్టింది. తొలుత దానిని సాధారణ పురుగు కాటుగానే భావించి ఆయన నిర్లక్ష్యం చేశారు.

అయితే, సుమారు 6 గంటల తర్వాత ఆయనకు తీవ్రమైన నొప్పులు, జ్వరం ప్రారంభమయ్యాయి. పరిస్థితి విషమించడంతో రాజేశ్ శర్మ హైదరాబాద్ నుంచి అత్యవసరంగా కోల్కతాకు పయనమయ్యారు. విమాన ప్రయాణంలో ఉండగానే ఆయన శరీరంలో షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోయాయి. దీనికి తోడు శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో ప్రయాణం అంతటా తీవ్ర ఆందోళన నెలకొంది.

కోల్‌కతా చేరుకున్న వెంటనే ఆయనను అక్కడి ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషపురుగు కాటు వల్ల సంభవించిన ఇన్ఫెక్షన్ పాదం నుంచి మోకాలి వరకు అత్యంత వేగంగా పాకినట్లు వైద్యులు గుర్తించారు. జ్వరం కూడా అస్సలు తగ్గకపోవడంతో, వైద్య బృందం ఆయనను ఐసీయూకి తరలించి అత్యవసర చికిత్స అందిస్తోంది. రాజేశ్ శర్మ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, చిత్ర పరిశ్రమ వర్గాలు ప్రార్థిస్తున్నారు.