4 April, 2026 | 4:57 AM

కాంగ్రెస్‌కు ఏటీఎంగా తెలంగాణ

04-04-2026 03:00 AM

ఇక్కడ దోచుకున్న డబ్బులను ఇతర రాష్ట్రాల్లో పంచుతున్నారు

మెట్రో విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు నిర్ణయాలు

ఎమ్మెల్యే కేపీ వివేకానంద

హైదరాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): దేశంలో కాంగ్రెస్‌కి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏటీఎంగా మారిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. తెలంగాణలో దోచుకున్న డబ్బులతో ఇతర రాష్ట్రాల్లో పంచుతున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి వచ్చిరాని ఇంగ్లీష్‌తో కేరళలో మాట్లాడుతుంటే ఆ రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివేకానంద మాట్లాడారు.

హైదరాబాద్ మెట్రో రైలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. రియల్ ఎస్టేట్ రంగానికే సీఎం రేవంత్ రెడ్డి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని వివేకానంద ఆరోపించారు. మూసీ సుందరీకరణ పేరుతో 3 వేల ఎకరాలు, హెచ్‌సీయూ భూములు, హిల్ట్ పాలసీ, టీడీఆర్‌తో కొల్లగొడుతూ ప్రభుత్వ ఆస్తులను తన అనుచరులకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ఎల్ అండ్ టీని బ్లాక్ మెయిల్ చేస్తూ కేసు పెట్టీ జైల్లో వేస్తామని మెట్రోకి చెందిన 250 ఎకరాలను కాజేసి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆరోపించారు.

మేము అధికారంలో ఉండి ఉంటే రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు, నార్త్ సైడ్ మేడ్చల్ వైపు సైతం మెట్రో పూర్తి చేసే వాళ్లమని స్పష్టం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మెట్రో స్వాధీనంపై స్టేట్ మెంట్ ఇచ్చి ఎటువంటి చర్చ చేయకుండా ఏకపక్ష నిర్ణయంతో చేస్తామని చెప్పి సభను నుంచి వెళ్లిపోయారని అన్నారు. 70 సార్లు ఢిల్లీ పోయిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో విషయంలో ఏనాడు కేంద్ర మంత్రితో మాట్లాడలేదన్నారు.

రాష్ట్రానికి పనికిరాని కేంద్ర మంత్రుల్లో కిషన్ రెడ్డి ముందు వరుసలో ఉంటే, రెండో వరుసలో బండి సంజయ్ ఉంటారని ఎద్దేవా చేవారు. జాతీయ ప్రాజెక్ట్ లేని రాష్ట్రం తెలంగాణ అని, అలంకారంగా మాత్రమే కేంద్ర మంత్రులు ఉన్నారు, తెలంగాణకు ఉపయోగపడే ఒక్క మంచి పని చేయ లేదని విమర్శించారు. కేరళలో సీఎం వ్యాఖ్యలపై తెలంగాణలో ఉండే సీపీఎం   స్పందిం చాలని, తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమ లు అవుతున్నాయో లేదో సీపీఐ, సీపీఎంను అడిగితే తెలుస్తుందన్నారు.