28 May, 2026 | 2:42 AM

సైబర్ క్రైమ్ పోలీసుల దూకుడు

28-05-2026 01:38 AM

వారం రోజుల్లో 6 సైబర్ నేరాలు ఛేదన,10 మంది అరెస్టు

బాధితులకు రూ.1.39 కోట్లు రీఫండ్

శేరిలింగంపల్లి మే 27 (విజయక్రాంతి): సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వారం రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న సైబర్ నేర ముఠాలపై ఉక్కుపాదం మోపారు. మే 20 నుంచి 26 వరకు 6 కేసులను ఛేదించి వివిధ రాష్ట్రాలకు చెందిన 10 మంది నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ టి. సాయి మనోహర్ బుధవారం వెల్లడించారు.

అరెస్టయిన వారిలో నలుగురు ట్రేడింగ్ ఫ్రాడ్కు పాల్పడిన వారే కావడం విశేషం.నమోదైన కేసుల్లో రెండు ట్రేడింగ్ ఫ్రాడ్లు కాగా, ఇంపర్సనేషన్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్, విషింగ్ కాల్ ఫ్రాడ్ ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. విషింగ్ కాల్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు నిందితులు పట్టుబడగా, మిగిలిన కేసుల్లో ఒక్కొక్కరిని అరెస్టు చేశారు.

ఈ వారంలో కీలకమైన కేసు నకిలీ ‘ACEFD’ ట్రేడింగ్ యాప్కు సంబంధించింది. ‘77 Accel Partners Stock Exchange Group” పేరుతో వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తూ బ్లాక్ ట్రేడింగ్, ఐపీఓ అలాట్మెంట్, అప్పర్ సర్క్యూట్ స్టాక్స్ పేరుతో భారీ లాభాల ఆశ చూపి ఓ వ్యక్తి నుంచి రూ.7,19,964 కాజేశారు. నకిలీ యాప్లో వర్చువల్ లాభాలు చూపించి నమ్మించిన నిందితులు, డబ్బును పలు బ్యాంకు ఖాతాలకు మళ్లించారు. మొదట చిన్న మొత్తాలు విత్డ్రా చేసే అవకాశం ఇచ్చి నమ్మకం కలిగించారు.

భారీగా సొమ్ము జమ అయ్యాక విత్డ్రాలను నిలిపివేసి, అదనపు కమీషన్ చెల్లిస్తేనే డబ్బు ఇస్తామని బెదిరించారు. మోసం గ్రహించేలోపు వాట్సాప్ గ్రూప్ను మ్యూట్ చేసి పరారయ్యారు. ఈ కేసులో సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూర్చి, మోసపూరిత సొమ్మును మళ్లించేందుకు కమీషన్ తీసుకున్న ఢిల్లీకి చెందిన అసిమ్ ఖాన్, షాజెబ్ ఖాన్, మొహమ్మద్ కమ్రాన్ను పోలీసులు అరెస్టు చేశారు.

అదే సమయంలో బాధితులకు ఊరట కలిగేలా 70 కేసుల్లో 440 రీఫండ్ ఆర్డర్లు సాధించి రూ.1,39,39,325 తిరిగి ఇప్పించినట్లు డీసీపీ తెలిపారు. సోషల్ మీడియా, వాట్సాప్ ఇన్వెస్ట్మెంట్ గ్రూపుల్లో అధిక లాభాల హామీలను నమ్మవద్దని ఆయన హెచ్చరించారు. ట్రేడింగ్ యాప్లు, సంస్థల విశ్వసనీయతను సెబీ వ్బుసైట్లో తనిఖీ చేసుకోవాలని, తెలియని లింకుల నుంచి యాప్లు డౌన్లోడ్ చేయవద్దని సూచించారు.