అష్టముఖి కోనేరు వద్ద పోటెత్తిన భక్తజనం.. అమావాస్య వస్తే
బోధన్: మే16 (విజయక్రాంతి): దక్షిణ భారతదేశంలో ఏకైక అష్టముఖి కోనేరు అయిన ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రసిద్ధి గాంచింది. కోనేరులో శనివారం రోజు అమావాస్య వస్తే ఈ కోనేరులో స్నానాలు ఆచరిస్తే సర్వపాపాలు తొలగిపోయి, అప్లైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. కాగా శనివారం ఎడపల్లి మండలం జాన్కంపేట్ శివారులోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు.
శనివారం అమావాస్య సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద గల దక్షిణ భారదేశంలోనే ప్రసిద్ధి గాంచిన ఏకైక పవిత్ర అష్టముఖి కోనేరులో స్నానాలు ఆచరించడానికి భక్తులు తరలివచ్చారు. ఉదయం 4 గంటల నుండే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పుష్కరిణిలో స్నానాలు ఆచరించి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టముఖి కోనేరు వద్ద భక్తుల సౌకర్యార్థం భద్రతా ఏర్పాట్లను ఆలయ సిబ్బంది, పోలీసులు, గ్రామస్థులు పర్యవేక్షించారు.
ఉదయం నుండే భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం, కోనేరు ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. శనివారం అమావాస్య అరుదుగా వచ్చే సందర్భంగా అష్టముఖి కోనేరు లో స్నానాలు ఆచరిస్తే సర్వపాపాలు తొలగుతాయని, శని దోషాలు హరింపబడుతాయని అని భక్తుల ప్రగాఢ నమ్మకం. దీంతో జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి భక్తులు పుష్కరిణిలో స్నానం ఆచరించేందుకు విచ్చేశారు.
భక్తుల దర్శనార్థం బారికేడ్లను నిర్మించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సుమారు 30 వేల పైచిలుకు భక్తులు అష్టముఖి కోనేరు లో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు మహిళలు కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా పెద్ద ఎత్తున దుకాణ సముదాయాలు వెలిశాయి. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సె పాండే రావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ ఈఓ వేణు, జూనియర్ అసిస్టెంట్ రఘు,ఆలయ పూజారి కొండమాచార్యులు, గ్రామస్తులు పురం సాయిలు, లక్ష్మణ్, మురళి, పలు ఆలయాల సిబ్బంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.






