14 August, 2026 | 5:22 AM

కుంటలో మునిగిన పంటలు..ఇబ్బందుల్లో రైతులు..

14-08-2026 12:00 AM

చెరువును తలపిస్తున్న పంట పొలాలు..పట్టించుకోని అధికారులు..

తాడ్వాయి,ఆగష్టు, 13( విజయ క్రాంతి ): అయ్యో అది చెరువు అనుకుంటున్నారా, అనుకుంటే పొరపాటే ఆ నీటి కింద పంట పొలాలు ఉన్నాయి పొలాలు కనపడకుండా నీరు కమ్మి వేసింది.ఈ సంవత్సరం వర్షాలు కురవడం లేదు,వర్షాలు ఎప్పుడు పడతాయి, వర్షాలు కురిపించు, పంటలు కాపాడు వాన దేవుడా అని ప్రార్థనలు చేసిన రైతన్నలకు ఆ వర్షాలే  ఇబ్బందులు తెచ్చి పెట్టాయి.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్ గ్రామంలోని శివారులో కుంట నీటిలో పంటలు మునిగిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గ్రామ శివారులోని నాగమ్మ కుంట ముందు భాగంలో రైతులు పంటలు వేసుకున్నారు.

ఆ పంటలు పండితే తమకు ఆదాయం వస్తుందని భావించారు.మొదట్లో వర్షాలు లేక తల్లడిల్లిన రైతులు ఎక్కువ వర్షాలు పడడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కన్కల్ గ్రామానికి చెందిన కౌడి మోహన్ రెండు ఎకరాల్లో పంట వేసుకున్నాడు.ఒక ఎకరం వరి మరో ఎకరంలో మొక్కజొన్న పంట సాగు చేశారు. మరో రైతు కౌడి రవీందర్ రెండు ఎకరాల్లో వరి పంట,కురుమ కొమురయ్య ఒక ఎకరంలో వరి పంట సాగు చేసుకున్నారు.

ఎక్కువ వర్షాలు పడడంతో నాగమ్మ కుంటలో ఎక్కువ నీరు రావడంతో వీరి పంటలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. దీంతో తమకు అపార నష్టం వాటిల్లిందని రైతులు బోరుమని విలపిస్తున్నారు. తాము వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేసుకుంటే ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలతో పంటలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారుల చుట్టూ తిరిగిన పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

రూ. 3 లక్షల పంట నష్టం..

నాగమ్మ కుంటలో మునిగిన రైతులకు రూ.3 లక్షల నష్టం వాటిల్లింది. వరి, మొక్కజొన్న పంటలు సాగు చేయడంతో విత్తనాలు ఎరువులు సాగుకు అయ్యే ఖర్చులు మొదలుకొని మొత్తం రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు వారు తెలిపారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి నాగమ్మ కుంట తూము తెరిపించి కుంట నుంచి నీటిని బయటకు వదిలి పెట్టాలని వారు కోరుతున్నారు. తాము ఇప్పటికే గ్రామ సర్పంచ్, మండల స్థాయి అధికారులకు తెలిపామన్నారు. అయినా అధికారులు పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయమై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. 

కుంట నుంచి నీటిని బయటకు పంపించాలి..

నాగమ్మ కుంట నుంచి నీటిని బయటకు పంపించాలి.నీటిని బయటకు పంపిస్తే తమ పంటలు నీటి నుంచి తేలుతాయి. దీంతో తమ పంటలు పండే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే నాగమ్మ కుంట తూము తెరిపించాలని వారు కోరుతున్నారు.

అధికారులు స్పందించాలి..

కన్కల్ శివారులోని నాగమ్మ కుంటలో తమ పంటలు పూర్తిగా మునిగిపోయాయి. వెంటనే అధికారులు స్పందించి నాగమ్మ కుంట తూమును తెరిపించాలి.తూము తెరిపిస్తే కుంటలో నీరు బయటకు వెళ్లిపోయి తమ పంటలు తేలుతాయి. దీంతో తమ పంటలు పండే అవకాశం ఉంది. లక్షల రూపాయలు సాగు కోసం వెచ్చించాం. అధికారులు స్పందించి తూమును తెరిపించాలి.

- కౌడి మోహన్, రైతు, కన్కల్