రోడ్డు ఇలా.. ప్రయాణం ఎలా?
ఎన్‌హెచ్ -365 బి రహదారి ప్రయాణం నరకప్రాయం
అధికారుల పర్యవేక్షణ లోపంతో నిత్యం ప్రమాదాలు
చేర్యాల, ఆగస్టు 13: సూర్యాపేట నుంచి సిరిసిల్ల వరకు ప్రాంతాల మధ్య మెరుగైన కనెక్టివిటీ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్ హెచ్365 బి జాతీయ రహదారి పనులు ప్రయాణికులకు శాపంగా మారాయి.కాంట్రాక్టర్ల లాభాపేక్ష, అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా ఈ రోడ్డు నిర్మాణం నత్తనడకన సాగుతూ,నిత్యం ప్రమాదాలు జరుగుతు నిండు ప్రాణాలను ప్రమాదంలో పడవేస్తూ బలిగొంటోంది.
నత్తనడకన రెండో దశ పనులు
సూర్యాపేట నుంచి జనగామ వరకు మొదటి దశ పనులు పూర్తయినప్పటికీ,జనగామ నుంచి దుద్దెడ క్రాస్ రోడ్డు వరకు ఉన్న సుమారు 45కి.మీ. మేర రెండో దశ పనులు గత మూడు సంవత్సరాలుగా పూర్తి కాలేదు.నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలేసి,కనీస పర్యవేక్షణ లేకుండా కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేస్తుండటంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిత్యం ప్రమాదాలు.. పట్టించుకోని అధికారులు
రోడ్డు పనులు ప్రారంభమైన నాటి నుంచి ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి.అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా అధికారుల్లో చలనం కరవైంది.ప్రమాదాలు జరిగిన తరువాత ఆప్రదేశాల్లో కేవలం తాత్కాలిక హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప,సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు విఫలమవుతున్నారు.
తాడూరు క్రాస్, చేర్యాలలో ప్రమాదకర పరిస్థితులు
ఎన్ హెచ్ -365 బి మార్గంలో తాడూరు క్రాస్ రోడ్డు సమీపంలో నిర్మించిన కల్వర్టు అత్యంత ప్రమాదకరంగా మారింది.అశాస్త్రీయ నిర్మాణ శైలి కారణంగా ఈ ప్రాంతం వాహనదారులకు పెనుభూమలంగా మారింది. చేర్యాల పట్టణంలో కొత్త బస్టాండ్ సమీపంలో రోడ్డు మధ్యలో ఉన్న పెద్ద గుంట వాహనదారులకు కంటికి కనిపించకుండా ఉండి ప్రమాదాలకు కారణ మవుతోంది. గాంధీ సెంటర్ వద్ద నిర్మించిన బ్రిడ్జి ఎగుడుదిగుడుగా ఉండటంతో నిత్యం వాహనాలు అదుపుతప్పుతున్నాయి.
బాధ్యులెవరు?
నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టారీతిగా చేపట్టిన నిర్మాణ పనులే ఈ ప్రాణనష్టానికి ప్రధాన కారణమని ప్రజలు మండిపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాల్సిన అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు,ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి వెంటనే స్పందించాలి. ఎన్ హెచ్ -365 బి రోడ్డు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నాణ్యతా లోపాలను సరిదిద్దాలి.ప్రయాణికులు ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.






