29 July, 2026 | 1:54 AM

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలి

29-07-2026 12:00 AM
  1. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి
  2. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ 

గణపురం,జూలై 28 (విజయ క్రాంతి): వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహు ల్ శర్మ లు అన్నారు. గణపురం మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతు నేస్తం‘ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ, ఎల్ని నో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున రైతులు ఆరుతడి పంటల సాగు పై దృష్టి సారించాలని సూచించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాగునీటి సౌకర్యాలు, సాంకేతిక సలహాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ, వర్షాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో రైతులు వరి నాట్లు వేయడంలో తొందరపడవద్దని, ఘనపసముద్రం చెరువులో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ సూచించిన పంటలనే సాగు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జాడి బాపురావు, సహాయ వ్యవసాయ సంచాలకుడు భూపాలపల్లి నల్లెల రమేష్, గణపురం తహసీల్దార్ ఏ సత్యనారాయణరావు, ఎంపీడీఓ ఎల్ భాస్కర్, మండల వ్యవసాయ శాఖాధికారి డి ఐలయ్య, వ్యవసాయ శాస్త్రవేత్త విశ్వ తేజ్, గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఓరుగంటి కృష్ణ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్, వ్యవసాయ విస్తరణ అధికారులు పవన్ కళ్యాణ్, కళ్యాణ్, అమూల్య తదితరులు పాల్గొన్నారు.