calender_icon.png 24 February, 2026 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్న కాంట్రాక్టర్లపై కక్ష

24-02-2026 12:43:57 AM

  1. మన ఊరు-మన బడి కాంట్రాక్టర్ల ఉసురు తీస్తున్న ప్రభుత్వం
  2. కమీషన్ల కోసమే బడా కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు
  3. మాజీమంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నకాంట్రాక్టర్లపై కక్ష సాధిస్తోందని, మన ఊరున బడి కాంట్రాక్టర్ల ఉసురు తీస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో పేద విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించామన్నారు.

కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1500 మంది చిన్న కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కక్ష సాధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు రాక, అప్పుల పాలై తీవ్ర ఇబ్బందులు పడుతున్న మన ఊరు-మన బడి సివిల్ కాంట్రాక్టర్లు సోమవారం హరీశ్‌రావును కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తమకు బిల్లులు చెల్లించడం లేదని, న్యాయంగా అడిగితే అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని వారు వాపోయారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వ కక్షపూరిత వైఖరిపై ఈ మేరకు హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. అప్పులు తెచ్చి పనులు చేసిన వారు నేడు మిత్తీలు కట్టలేక రోడ్డున పడ్డారని, అప్పుల బాధతో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్న కాంట్రాక్టర్లకు పైసల్లేవంటున్న ప్రభుత్వం.. పెయింటింగ్, బెంచీలు సరఫరా చేసిన బడా కంపెనీలకు మాత్రం రాత్రికి రాత్రే వందల కోట్లు ఎలా విడుదల చేసింది? మీకు కమీషన్లు ఇవ్వరనే ఈ చిన్న కాంట్రాక్టర్ల బిల్లులను సీఎం గాలికి వదిలేశారా అని ప్రశ్నించారు. తమ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ప్రజావాణిలో మొరపెట్టుకున్నా, విద్యాశాఖ అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేదు, సీఎం అపాయింట్మెంట్ ఇవ్వరు..

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను వేడుకున్నా స్పందన లేదు.. చివరికి సచివాలయంలో ఆర్థిక మంత్రి ఛాంబర్ ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపితే.. వారిపై అక్రమ కేసులు బనాయించడం ఈ ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్ట అని విమర్శించారు. పేద పిల్లల కోసం పాఠశాలలు బాగుచేసిన చిన్న కాంట్రాక్టర్లను ఇబ్బందులు పెట్టొదని, వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేసి, వారిపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.