calender_icon.png 24 February, 2026 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనాథ పిల్లల సంరక్షణే లక్ష్యం

24-02-2026 12:41:59 AM

  1. అనాథ యువత నైపుణ్యాభివృద్ధిలో కీలక ముందడుగు
  2. ప్రభుత్వం, జీఎంఆర్ ఏరో అకాడమీ, ఫిక్కీ ఒప్పందాలు
  3. మహిళా భద్రత, సాధికారతపై కీలక నిర్ణయాలు
  4. మంత్రి సీతక్క

హైదరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): అనాథ పిల్లల సంరక్షణ రాష్ట్ర ప్రభు త్వం బాధ్యత అని, వారికి కేవలం ఆశ్రయమే కాదు... భవిష్యత్తు కల్పించడమే తమ లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. పరిశ్ర మలతో భాగస్వామ్యం ద్వారా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించి వారిని స్వతహాగా ఎదిగేలా తీర్చిదిద్దడం ప్రభుత్వ కర్తవ్యమని పేర్కొన్నారు.

సోమవారం సచివాలయంలో మంత్రి సీతక్క సమక్షంలో తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అనాథ పిల్లల నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనతో పాటు అంగన్‌వాడీ టీచర్ల వత్తి నైపుణ్యాభివృద్ధి దిశగా పలు కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి సృష్టి లక్ష్యాలతో రూపొందించిన ఈ కార్యక్రమాలు ప్రభుత్వం భాగస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని ఆమె తెలిపారు.

సమగ్ర పునరావాసం, శిక్షణ, ఉపాధి కల్పనలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్య అనాథ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపనుందని స్పష్టం చేశారు. మూడేళ్లలోపు చిన్నారుల కోసం క్రష్ సెంటర్లు ఏర్పాటు చేసి, అంగన్‌వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. మారుతున్న కాలానికి, అవసరాలకు అనుగుణంగా అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు.

ప్రభుత్వ సంరక్షణలో, శక్తి సదన్‌లో ఉంటున్న ఉన్న అనాథ యువతకు విమానయాన రంగంలో నైపుణ్య శిక్షణ అందించేందు కు జీఎంఆర్ ఏరో అకాడమితో ఒప్పందం కుదిరిందని, ఈ కార్యక్రమం 2026 మార్చి నుంచి శంషాబాద్‌లో ప్రారం భం కానుందని తెలిపారు. పాలిటెక్నిక్ చదువుతున్న అనాథ బాలికలకు ఇండస్ట్రీ ట్రైనింగ్, సాఫ్ట్ స్కిల్స్, డిజిటల్ లిటరసీ శిక్షణ అందించేందుకు ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్‌తో మహిళా శిశు సంక్షేమ శాఖ ఒప్పందాలు చేసుకుందని తెలిపారు.

అంగన్‌వాడీ సేవల బలోపేతానికి అజీమ్ ప్రేమ్ జీ యునివర్సిటీతో కలిసి 6 నెలల ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కోర్సు అమలు చేయనున్నారు. మహిళల సమగ్ర సంక్షేమం కోసం శాఖల మధ్య సమన్వయం పెంపొందిస్తూ కార్యాచరణ ప్రణాళిక రూపొం దించాలని మంత్రి సీతక్క సూచించారు.

మహిళల అభివృద్ధి, సాధికారత, సమాన అవకాశాలు, భద్రత అంశాలపై పలు కీలక శాఖలతో సోమవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి సీతక్క మాట్లాడారు. లింగ వివక్షను నిర్మూలించి మహి ళలకు సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.

విద్యా వ్యవస్థలోనే లింగ సమానత్వ భావనను బలపరిచే విధంగా పాఠ్యాంశాలలో మార్పులు చేయాల్సిన అవసరాన్ని చర్చించారు. ఉద్యో గ రంగంలో మహిళలకు సమాన హక్కులు, ప్రైవేటు రంగంలోనూ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అమలు చేయాలని, మహిళా శిశు సంక్షేమ, పోలీస్ శాఖల సమన్వయంతో మహిళా భద్రత విషయంలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.