11 June, 2026 | 1:27 AM

ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు సీపీఐ పోరాటం

11-06-2026 12:10 AM

పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు 

సూర్యాపేట టౌన్, జూన్ 10: కేంద్రంలో అధికారంలో ఉండి నిత్యావసరాల ధరలను పెంచుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు సిపిఐ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని ఆ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు.

దేశంలో పెరుగుతున్న అధిక ధరలకు నిరసనగా బుధవారం సిపిఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల ప్రచారంలో లీటర్ పెట్రోల్ రూ.40లకే ఇస్తామని నమ్మబలికిన నరేంద్ర మోడీ, నేడు లీటర్ ధరను రూ.110కి పైగా పెంచి సామాన్యుల నడుము విరుస్తున్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని, ఫలితంగా అదానీ, అంబానీల ఆస్తులు వేల కోట్లకు పెరిగాయన్నారు.

ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలని వామపక్షాలు పార్లమెంట్లో డిమాండ్ చేసినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచేశారని విమర్శించారు. రైతు పండించే వరి ధాన్యానికి క్వింటాల్కు కేవలం రూ.72 మాత్రమే పెంచి, ఎరువుల బస్తాలపై మాత్రం రూ.700_ 1000 వరకు పెంచడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లావుల రాములు, ధూళిపాళ ధనుంజయ నాయుడు, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన తదితరులు పాల్గొన్నారు.