18-02-2026 01:47:08 PM
కాకా వారసత్వాన్ని కాలరాస్తూ ప్రజాస్వామ్యం ఖూనీ
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు శంకర్
మందమర్రి, (విజయక్రాంతి): క్యాతనపల్లి మున్సిపాలిటీ(Kyathanpally Municipality) సాక్షిగా సాగుతున్నది ప్రజాస్వామ్య పాలన కాదనీ, అచ్చమైన గూండా రాజకీయం అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు అక్షరాలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన మండిపడ్డారు. పవిత్రమైన రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికార పీఠాలపై కూర్చున్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణలు ఈ అరాచకాలకు ప్రత్యక్ష సూత్రధారులు కావడం అత్యంత శోచనీయమని, ఇది ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు.
కాకా ఆశయాలను సమాధి చేస్తున్నారు
సింగరేణి ప్రాంత ప్రజల గుండెల్లో 'కాకా' వెంకటస్వామికి ఒక మహోన్నత స్థానం ఉందని, ఆయన ఈ ప్రాంత కార్మికుల కోసం, అభివృద్ధి కోసం తన జీవితాన్ని ధారపోశారని శంకర్ గుర్తు చేశారు. అటువంటి మహనీయుని వారసులుగా రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ వెంకటస్వామి, యువకుడైన ఎంపీ వంశీకృష్ణలు తమ అప్రజాస్వామిక చర్యలతో ఆయన సంపాదించిన మంచి పేరును నిలువునా నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. స్వార్థ రాజకీయాల కోసం, అధికార దాహం కోసం గూండాలను ప్రోత్సహిస్తూ కాకా వారసత్వాన్ని మంటగలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి, ఎంపీల సమక్షంలోనే కౌన్సిల్ హాల్ తలుపులు మూయించి, మీడియాను రాకుండా అడ్డుకుని చీకటి రాజకీయం నడపడం వారి దిగజారుడు తనానికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు.
మహిళా ప్రతినిధులపై దాడులు సిగ్గు చేటు...
కౌన్సిల్ హాల్ లోనే మహిళా ప్రతినిధులపై భౌతిక దాడులు జరగడం సభ్య సమాజం తలదించుకునేలా, సిగ్గు మాలిన చర్య అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిదో వార్డుకు చెందిన గిరిజన అభ్యర్థి మణిపై గుర్రపు శీను అనే వ్యక్తి దాడికి తెగబడటం, ఒక విద్యావంతురాలు, డాక్టర్ అయిన మహిళా చైర్మన్ అభ్యర్థి పట్ల అత్యంత అమర్యాదగా ప్రవర్తించడం అమానుషమని మండిపడ్డారు. డాక్టర్, మహిళా కౌన్సిల్ సభ్యురాలు కన్నీటి పర్యంతమవ్వడం చూస్తుంటే తెలంగాణలో మహిళలకు రక్షణ కరువైందని స్పష్టంగా కనిపిస్తోందన్నారు. యువ ఎంపీగా ఉన్న వంశీకృష్ణ ఈ అరాచకాల్లో ప్రధాన పాత్ర పోషించడం చూస్తుంటే, రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యం మరింత ప్రమాదంలో పడే సూచనలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అసభ్యంగా ప్రవర్తించిన గుర్రపు శీనుపై కఠిన చర్యలు తీసుకోవాలని, అతనిని కౌన్సిలర్ పదవి నుండి తక్షణమే అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ తో అధికారులు కుమ్మక్కు...
ఎన్నికల సంఘం మీడియా పాస్ లు జారీ చేసినప్పటికీ అధికారులు మీడియాను లోపలికి అనుమతించకపోవడం వెనుక ఒక వ్యవస్థీకృత కుట్ర దాగి ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులతో అధికారులు కుమ్మక్కు అయ్యారని, లోపల జరుగుతున్న వికృత చేష్టలు, మహిళా ప్రతినిధులపై జరుగుతున్న దాడులు బాహ్య ప్రపంచానికి తెలియకూడదనే ఉద్దేశంతోనే మీడియా గొంతు నొక్కారని మండిపడ్డారు. కనీసం లోపల ఏం జరిగిందో తెలుసుకోవడానికి సిసిటివి ఫుటేజ్ అడిగినా ఇవ్వకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
ఈ పూర్తి అరాచక పర్వానికి ఎన్నికల నిర్వహణ అధికారిగా ఉన్న ఎంఆర్ఓ పూర్తి బాధ్యత వహించాలని, ప్రజలకు అసలు నిజానిజాలు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యక్తిగత వైషమ్యాలను కౌన్సిల్ మీద రుద్ది, క్యాతనపల్లిలో అశాంతిని సృష్టించిన అధికార పక్షానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదులంతా గొంతెత్తాలని కలవేన శంకర్ పిలుపునిచ్చారు. బుధ వారం సిపిఐ, బిఆర్ఎస్ ఇచ్చిన క్యాతనపల్లి బంద్ పిలుపులో స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు తెలిపిన పాఠశాల యాజమాన్యాలకు, వ్యాపారస్తులకు, ప్రజా సంఘాల నాయకులకు, ప్రజాస్వామ్య వాదులకు, క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.