రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
- బైక్‌ను ఢీకొట్టిన కారు
- వరంగల్ జిల్లా నర్సంపేటలో ఘటన
మహబూబాబాద్, మే 18 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తయింది.. కొత్తింటి గృహప్రవేశానికి కావలసిన ఫర్నిచర్ కొనడానికి బైక్‌పై వెళుతున్న దంపతులను కారు ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం వెంగంపేట శివారు ఫాల్తియా తండాకు చెందిన బోడ రమేష్ (40), ఆయన భార్య పూలమ్మ బైక్‌పై నర్సంపేటకు ఫర్నిచర్ కొనడానికి వెళ్తున్నారు.
నర్సంపేట సమీపంలో 365 జాతీయ రహదారిపై కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. కొద్దిపాటి వ్యవసాయంలో కూరగాయలు పండించి, వారాంతపు సంతల్లో విక్రయిస్తూ ఇద్దరు పిల్లలను చక్కగా చదివిస్తున్న కుటుంబం, చీకటిమయమైంది. దుర్మరణం పాలైన దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. నర్సంపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.






