11-02-2026 03:10:41 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి) : తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ పాలసీపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఏడీ ముఖ్యకార్యదర్శి , సమాచార శాఖ కమిషనర్‌తో పాటు మీడియా అకాడమీ చైర్మన్‌కు హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి 12కు వాయిదా వేసింది. అక్రిడిటేషన్ అర్హతలకు సంబంధించి ప్రభుత్వం గత ఏడాది ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ హైటెక్ ప్రింట్ అండ ఎలక్ట్రానిక్ మీడియా అసోషియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి ఆపరేష్‌కుమార్ సింగ్, జస్టిస్ మొయినొద్దీన్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ కేబుల్ చానళ్లు, డిజిటల్ మీడియాకు అక్రిడేషన్ కార్డుల జారీకి నిర్ణయించిన అర్హతలు రాజ్యాంగ విరుద్ధమన్నారు. జీవోను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనికి ధర్మాసనం నిరాకరించింది. ప్రభుత్వం ఏ ప్రతిపాదికన మార్గదర్శకాలు జారీ చేసిందో వాదనలు వినకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు చెప్పింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.