9 July, 2026 | 1:24 AM

సింగపూర్ టవర్‌లో ఎస్‌ఐఆర్ శిబిరం పరిశీలించిన కౌన్సిలర్ ఆనంద్ రావు

09-07-2026 12:23 AM

శంకర్పల్లి: జూలై 8 ( విజయ క్రాంతి ): ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సింగపూర్ టవర్లో ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటి వార్డు కౌన్సిలర్ ఆనంద్రావు ఎర్ర పాల్గొని శిబిరం నిర్వహణ తీరును పరిశీలించారు. సింగపూర్ టవర్లో నివసిస్తున్న 1, 9, 10 వార్డులకు చెందిన ఓటర్లు తమ ఓటరు నమోదు, వివరాల సవరణ, చిరునామా మార్పు, పేర్ల చేర్పు, తొలగింపు వంటి సేవలను ఒకే వేదికపై సులభంగా పొందేలా ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయాలనే పరిపాలనా దృక్పథానికి ఇది నిదర్శనమని స్థానికులు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ ఆనంద్రావు మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ప్రతి అర్హులైన పౌరుడు తన ఓటరు వివరాలు సక్రమంగా నమోదై ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. ప్రభుత్వం, ఎన్నికల సంఘం కల్పించిన ఈ ప్రత్యేక అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల చైతన్యమే పారదర్శక ఎన్నికల వ్యవస్థకు బలమైన పునాదిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఎల్‌ఓ పద్మారావు, సూపర్వైజర్ సంగీత, మున్సిపల్ సిబ్బంది రామచందర్, శ్రీకాంత్, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.